
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు
ఆర్టీసీ ఈడీ సొలొమన్
ఖమ్మంమయూరిసెంటర్: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కరీంనగర్ జోన్ ఈడీ సొలొమన్ ఆదేశించారు. ఖమ్మంలోని రీజియన్ మేనేజర్ కార్యాలయం, పాత, కొత్త బస్టాండ్లను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు, కార్గో పాయింట్, డిస్పెన్సరీలో పరిశీలించాక రీజినల్ మేనేజర్ సరిరామ్‌తో కలిసి అధికారులతో సమావేశమయ్యారు. బస్సు సర్వీసుల నిర్వహణలో నిర్లక్ష్యం చేయొద్దని, ప్రయాణికుల డిమాండ్ ఆధారంగా కొత్త రూట్లను గుర్తించాలని సూచించారు. ఖమ్మం డిపో మేనేజర్ దినేష్‌కుమార్, అసిస్టెంట్ మేనేజర్ రామయ్య, సూపర్‌వైజర్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.
● మధిర: ఆర్టీసీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ఈడీ సాలొమాన్ సూచించారు. మధిర డిపోను తనిఖీ చేసిన ఆయన సర్వీసుల నిర్వహణ, తదితర అంశాలపై ఉద్యోగులకు సూచనలు చేశారు. ఖమ్మం ఆర్‌ఎం సరిరామ్, మధిర డీఎం శంకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ కార్యదర్శిగా ప్రవీణ్‌కుమార్ కొనసాగింపు
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి(ఆన్ డ్యూటీ)గా విధుల్లో ఉన్న పి.ప్రవీణ్‌కుమార్‌కు మరో ఏడాది పాటు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. పటాన్‌చెరువు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి అయిన ప్రవీణ్‌ను గత ఏడాది జనవరిలో ఖమ్మంకు కేటాయించారు. మరోమారు ఏడాది పొడించడంతో 2026 ఏప్రిల్ వరకు ఆయన ఇక్కడే విదులు నిర్వర్తించనున్నారు.
గ్రేడ్–2 కార్యదర్శులకు పదోన్నతులు
రాష్ట్రంలో నలుగురు కార్యదర్శులకు గ్రేడ్–2 నుంచి గ్రేడ్–1గా పదోన్నతి కల్పించారు. ఇందులో భాగంగా సత్తుపల్లి మార్కెట్‌లో పనిచేస్తున్న జి.సత్యనారాయణకు పదోన్నతి కల్పించి కల్లూరుకు, ఖమ్మం మార్కెట్ నుంచి వి.సృజన్‌బాబుకు పదోన్నతి కల్పించి లక్సెట్‌పేట మార్కెట్‌కు బదిలీ చేశారు. అయితే, ఖమ్మం మార్కెట్ గ్రేడ్–2 కార్యదర్శిగా మాత్రం ఎవరినీ నియమించలేదు.
క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభం
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్‌లో క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన శిక్షణ శిబిరాన్ని మంగళవారం ప్రారంభించారు. శిబిరాన్ని క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సీహెచ్.వెంకట్ ప్రారంభించి మాట్లాడుతూ ఔత్సాహికులకు మెరుగైన శిక్షణ ఇచ్చి హెచ్‌సీఏ టోర్నీలో ఆడేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈకార్యక్రమంలో కన్వీనర్ ఎం.డీ.మాసూద్‌తో పాటు ఫారూఖ్, తురాబ్ అలీ తదితరులు పాల్గొన్నారు.
హైడల్ ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఈ
కూసుమంచి: మండలంలోని పాలేరులో మినీ హైడల్ ప్రాజెక్టు(జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం)లో మరమ్మతు పనులను జెన్‌కో సీఈ(సివిల్) నారాయణ మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా పురోగతిపై ఆరా తీసిన ఆయన, వర్షాకాలంలోగా పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే, గత ఏడాది సెప్టెంబర్‌లో వచ్చిన భారీ వరదలతో ప్రాజెక్టుకు నీరు సరఫరా చేసే కాల్వ కట్ట తెగిన నేపథ్యాన, అక్కడ చేపడుతున్న మరమ్మతులను కూడా సీఈ పరిశీలించారు. ఎస్‌ఈ దేశ్యా, డీఈ సింహాచలం పాల్గొన్నారు.
వడదెబ్బతో ఇద్దరు మృతి
మఽధిర/చింతకాని: మధిర మండలం నిదానపురానికి చెందిన కనపర్తి దానయ్య(49) వడదెబ్బకు గురై మంగళవారం మృతి చెందాడు. ఎండల కారణంగా అస్వస్థతకు గురైన ఆయనను ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని కుటుంబీకులు తెలిపారు. దానయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాగే, చింతకాని మండలం నాగులవంచలో ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లిన గొడ్డుగొర్ల కేజీరాణి(55) వడదెబ్బకు గురై మంగళవారం మృతి చెందింది. గత శనివారం పనికి వెళ్లిన ఆమె ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురికాగా ఖమ్మం ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.