కోతలకు చెక్ !
● రానున్న వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రణాళిక ● రూ.9.35 కోట్లతో 10 సబ్‌స్టేషన్లలో 8 ఎంవీఏలు ● అదనంగా 655 ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు కసరత్తు ● 1,700 మెగావాట్ల విద్యుత్ వినియోగానికి చర్యలు
జిల్లాలో విద్యుత్ కనెక్షన్ల వివరాలు
గృహాలు 4,92,745
వ్యవసాయం 1,18,267
పరిశ్రమలు 65,822
ఇతరాలు 12,839
మొత్తం 6.90,273
ఖమ్మంవ్యవసాయం: వేసవిలో విద్యుత్ సమస్యలు ఎదురుకాకుండా ఎన్పీడీసీఎల్ ముందస్తుగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. జిల్లాలో గత అనుభవాలు, విద్యుత్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని తదనుగుణంగా నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు చేపట్టారు. వేసవి ఉష్ణోగ్రతలు, జలాశయాల్లో నీరుండటంతో యాసంగి పంటల సాగు వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ విద్యుత్ ప్రణాళికకు రూపకల్పన చేశారు. విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని లోడుకు తగిన విధంగా సబ్ స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు చేపట్టారు. వేసవిలో విద్యుత్ అంతరాయాలకు చెక్ పెట్టేలా చర్యలు తీసుకోవాలనే వరంగల్ ఎన్పీడీసీఎల్ సీఎండీ కె.వరుణ్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. ఇప్పటికే పలు ప్రాధాన్యతా ప్రాంతాల్లో ఈ ప్లాన్‌ను అమలు చేస్తోంది. జిల్లాలో 33/11 కేవీ సబ్ స్టేషన్లు 125 ఉన్నాయి. వీటి నుంచి 545 ఫీడర్ల ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతోంది. జిల్లాలో ఏటేటా విద్యుత్ వినియోగం పెరుగుతోంది. గతేడాది విద్యుత్ కనెక్షన్ల ఆధారంగా జిల్లాకు ఎన్పీడీసీఎల్ 1,412.44 మెగావాట్ల విద్యుత్ కేటాయించింది. దీనిలో 1,285.23 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఈ ఏడాది వేసవి నాటికి పెరగనున్న వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని అందుకు అనుగుణంగా విద్యుత్ సరఫరా కోసం సబ్ స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు చేపట్టారు.
ఎంవీఏల సామర్థ్యం పెంపు..
సాధారణంగా సబ్ స్టేషన్లు 5 ఎంవీఏ(మెగా వోల్ట్ యాంపియర్లు)లుగా ఉంటాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో గల సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ వినియోగం అధికంగా ఉండడంతో సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఆయా సబ్ స్టేషన్లను గుర్తించిన విద్యుత్ శాఖ 5 ఎంవీఏల స్థానంలో సామర్థ్యాన్ని పెంచి 8 ఎంవీఏల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. జిల్లాలోని 10 సబ్ స్టేషన్లలో ఈ పనులు ప్రారంభమయ్యాయి. ఒక్కో ఎంవీఏ ఏర్పాటుకు రూ.85 లక్షల చొప్పున ఖర్చవుతుంది. ఇప్పటికే మిట్టపల్లి, జన్నారం, బత్తులపల్లి సబ్ స్టేషన్లలో 8 ఎంవీఏలను ఏర్పాటు చేశారు. ఖమ్మం నగరంలోని ఖానాపురం సబ్ స్టేషన్‌లో రెండు 8 ఎంవీఏలు, టౌన్–3 ఐడీఏ సబ్ స్టేషన్, బురహాన్‌పురం, గాంధీచౌక్–2, రామాలయం, తల్లాడ, పెద్దకోరుకొండి సబ్ స్టేషన్లలో 8 ఎంవీఏల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. నగరంలోని మమత రోడ్ సబ్ స్టేషన్‌లో 12.5 ఎంవీఏ, ఇల్లెందు క్రాస్ రోడ్, టేకులపల్లి, కొత్త లింగాల, తనికెళ్ల సబ్ స్టేషన్లలో 12.5 8 ఎంవీఏలను గతేడాది ఏర్పాటు చేశారు.
అవసరమైతే నూతన ట్రాన్స్‌ఫార్మర్లు..
జిల్లాలో మరో 655 నూతన ట్రాన్స్‌ఫార్మర్లు అవసరమని విద్యుత్ శాఖ గుర్తించింది. ఖమ్మం నగరంతో పాటు గ్రామాల్లో అవసరమైన చోట వీటిని ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. ప్రాధాన్యతా క్రమంలో ఇప్పటికే 162 ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి నాటికి ఎంపిక చేసిన సబ్ ఏ్టషన్లలో 8 ఎంవీఏల ఏర్పాటు, నూతన ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాట్లు జరిగేలా విద్యుత్ శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది. ఇక తొండలు, బల్లులు, ఉడతలు వంటి వాటితో ట్రాన్స్‌ఫార్మర్లలో, ఫ్యూజ్‌ల్లో సమస్యలు తలెత్తకుండా డెన్‌ప్లాస్ట్ ఇన్సూలేషన్ ఏర్పాటు పనులు ప్రారంభించారు.
కోటా పెరిగినా ఇక్కట్లు రాకుండా..
జిల్లాలో పెరుగుతున్న వినియోగానికి తగ్గట్టుగా విద్యుత్ సరఫరాకు అవసరమైన చర్యలకు ఎన్పీడీసీఎల్ ప్రాధాన్యం ఇస్తోంది. జిల్లాకు గతేడాది 1,412.44 మెగావాట్ల విద్యుత్ కోటా కేటాయించిన సంస్థ ఈ ఏడాది 1,700 మెగావాట్లకు అనుగుణంగా సాంకేతిక ఏర్పాట్లకు ప్రాధాన్యం ఇస్తోంది. సమృద్ధిగా కురిసిన వర్షాలతో జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్‌లో విస్తారంగా పంటలు సాగయ్యే అవకాశం ఉండటం, పారిశ్రామిక అవసరాలు పెరగటం, ఖమ్మం నగరంలో వాణిజ్య వ్యవస్థ గణనీయంగా పెరగటం, ప్రజల విద్యుత్ వినియోగం కూడా పెరగటంతో అందుకు అనుగుణంగా సరఫరాను పెంచేలా చర్యలు చేపట్టింది.
ప్రత్యేక కార్యాచరణతో కనెక్షన్లు
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరులో ప్రత్యేక కార్యాచరణ అవలంబిస్తున్నట్లు ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ ఎ. సురేందర్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో గతేడాది 4,437 సర్వీసులు మంజూరు చేశామని చెప్పారు. వ్యవసాయ సర్వీసుల మంజూరుకు ఆన్‌లైన్ విధానంతో ప్రక్రియ వేగవంతం అవుతుందన్నారు. దరఖాస్తులు ఎక్కడ పెండింగ్‌లో ఉన్నాయో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.


