
నేడు ఉమ్మడి జిల్లాలో కేటీఆర్ పర్యటన
● ఇల్లెందు, కొత్తగూడెం, ఖమ్మంలో పట్టభద్రులతో సమావేశం
ఖమ్మంమయూరిసెంటర్ : ఖమ్మం – నల్గొండ – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్‌రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉమ్మడి జిల్లాలో పట్టభద్రులతో సమావేశం కానున్నారు. ఉదయం 10 గంటలకు భద్రాద్రి జిల్లా ఇల్లెందు జేకే గ్రౌండ్స్(సింగరేణి)లో పట్టభద్రులతో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12గంటలకు కొత్తగూడెం క్లబ్‌లో పట్టభద్రులతో సమావేశమవుతారు. సాయంత్రం ఖమ్మంలోని ఎస్‌బీఐటీ కళాశాలలో పట్టభద్రులతో సమావేశమై మాట్లాడతారు. కాగా, కేటీఆర్ పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి. ఆదివారం ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశాలు నిర్వహించి ఈ మేరకు దిశానిర్దేశం చేశారు.
26న ‘నెల నెలా వెన్నెల’
ఖమ్మంగాంధీచౌక్ : నెల నెలా వెన్నెల 82వ అభ్యుదయ సాంస్కృతిక కందంబం కార్యక్రమాన్ని ఈనెల 26వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు అమరజీవి అన్నాబత్తుల రవీంద్రనాథ్ కళా సాంస్కృతిక సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు మోటమర్రి జగన్‌మోహన్ రావు, ఎ.సుబ్రహ్మణ్యకుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం వారొక ప్రకటన విడుదల చేశారు. గంగోత్రి పెదకాకానికి చెందిన కళాకారుల బృందం ఆస్తికలు అనే నాటికను ప్రదర్శించనుందని తెలిపారు. ఖమ్మం నగరానికి చెందిన మాస్టర్ సంతోషి రెడ్డి బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించే ఈ కార్యక్రమానికి ఖమ్మం కళా పరిషత్, ప్రజానాట్యమండలి సహకారం అందిస్తున్నాయని, సామాజిక చైతన్యం కోసం నిర్వహించే నెల నెలా వెన్నెల కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.
ఉమ్మడి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నిక
ఖమ్మంస్పోర్ట్స్: ఖమ్మం, భద్రాద్రి జిల్లాల ఒలింపిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశం ఖమ్మం నగరంలోని జూబ్లీ క్లబ్‌లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఉమ్మడి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆర్చరీ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా వ్యవహరిస్తున్న పుట్టా శంకరయ్యను, కార్యదర్శిగా కబడ్డీ సంఘం కార్యదర్శి కె.క్రిష్టఫర్ బాబును ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా ఉప్పల్ రెడ్డి, బీఎన్ ప్రేమ్ కుమార్, సీహెచ్ వీరభద్రం, ఈ మొగులయ్య, డాక్టర్ అనిల్ కుమార్, జాయింట్ సెక్రటరీలుగా ఎం.కృష్ణ సాయి, కె.ఆదర్శ్ కుమార్, ఓలేటి సాంబమూర్తి, ఎం.గణేష్, జి. హనుమంత రాజు, కోశాధికారిగా శ్రీనివాసరావు, సభ్యులుగా వి. నాగేంద్ర కుమార్, కె. సైదులు, కాశీ హుస్సేన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర పరిశీలకులుగా ఒలింపిక్ సంఘం తరఫున మల్లారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధి ఎండీ అక్బర్ అలీ, డాక్టర్ పి.రఘునందన్, ఎం.అనంతరాములు తదితరులు హాజరయ్యారు.
పరిసరాలు పరిశుభ్ర ంగా ఉంచుకోవాలి
భద్రాచలంటౌన్: వర్షాకాలం సమీపిస్తున్నందున ఆదివాసీ గిరిజన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, జ్వరం వస్తే ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స పొందాలని పేర్కొన్నారు. వైద్య సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉంటూ గిరిజనులకు సలహాలు సూచనలు ఇవ్వాలని సూచించారు.

నేడు ఉమ్మడి జిల్లాలో కేటీఆర్ పర్యటన

నేడు ఉమ్మడి జిల్లాలో కేటీఆర్ పర్యటన