ప్రపంచ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ‘లూనా’
● ఖమ్మం యువకుడు ఆకాష్ చేతిలో రూపకల్పన
ఖమ్మంమయూరిసెంటర్: చిన్న వయస్సు నుంచే ఆవిష్కరణలు చేస్తున్న ఖమ్మం యువకుడు ఇప్పుడు ప్రపంచస్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించాడు. ఖమ్మం నగరానికి చెందిన గోగినేని ఆకాష్ ఇంజనీరింగ్ తర్వాత పీజీ కోసం అమెరికా వెళ్లాడు. ఆయనకు సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు ఉండడంతో ఆర్ట్ గీసి సాంకేతికంగా ఆ బొమ్మకు ప్రాణం పోసి నాలుగు నిమిషాల నిడివితో షార్ట్‌ఫిల్మ్ రూపొందించాడు. మానవుడు భూమిపై కాకుండా ఆకాశంలో సైతం అద్భుతాలు చేస్తే భావితరాలకు ఎలాంటి ప్రయోజనం ఉంటుందో ఈ చిత్రంలో వివరించాడు. లూనా పేరుతో రోబో ఎక్స్‌ప్లాజర్ చేసి రూపొందించిన షార్ట్‌ఫిల్మ్ ఇప్పుడు ప్రపంచ స్థాయి పోటీలకు ఎంపికై ంది.
60 దేశాలు.. వేయికి పైగా చిత్రాలు
ప్రపంచ ఫిల్మ్ ఫెస్టివల్(పోటీలు) న్యూఢిల్లీలో ఫిబ్రవరి 13నుంచి 15వరకు జరగనుంది. ఇందుకు సంబంధించి నిర్వాహకులు షార్ట్ ఫిలింలను ఆహ్వానించగా 60 దేశాల నుంచి సుమారు వేయికిపైగా చిత్రాలు అందాయి. ఇందులో నుంచి కొన్నింటినే ఎంపిక చేస్తే ఆకాష్ రూపొందించిన లూనా షార్ట్ ఫిల్మ్‌కు స్థానం దక్కింది. ఢిల్లీలో జరిగే జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(జేఐఎఫ్‌ఎఫ్), న్యూఢిల్లీ ఫిలిం ఫెస్టివల్(ఎన్డీఎఫ్‌ఎఫ్) రెండింటికి లూనా ఎంపిక కావడం విశేషం.
23న డీసీఎంఎస్ మహాజన సభ
ఖమ్మంవ్యవసాయం: జిల్లా కో–ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్) మహాజన సభ ఈనెల 23న శుక్రవారం నిర్వహిస్తున్నట్లు సంస్థ బిజినెస్ మేనేజర్ కె.సందీప్ తెలిపారు. అదనపు కలెక్టర్, డీసీఎంఎస్ పర్సన్ ఇన్‌చార్జి పి.శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఉదయం 11గంటలకు ఖమ్మం వీడీవోస్ కాలనీలోని డీసీఎంఎస్ కార్యాలయంలో సభ మొదలవుతుందని పేర్కొన్నారు. ఖమ్మం పంపింగ్‌వెల్ రోడ్ భూముల్లో గోదాంల నిర్మాణం, డీసీఎంఎస్ దుకాణ సమూదాయాల అద్దె పెంపు, 2024–25 వార్షిక ఆడిట్‌పై చర్చ, ఆమోదం తెలపనున్న ఈ సమావేశానికి సభ్యులు హాజరుకావాలని ఆయన ఓ ప్రకటనలో సూచించారు.
వివాహిత మృతిపై అనుమానాలు
● మృతదేహాన్ని బయటకు తీసి పరీక్షలు
ఖమ్మంక్రైం: ఖమ్మం టూటౌన్ పరిధిలో ఈనెల 11వ తేదీన వివాహిత మృతి చెందగా, ఘటనపై అనుమానాలు ఉన్నాయని ఆమె తల్లి ఫిర్యాదుతో సోమవారం కేసు నమోదు చేసినట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు. రేవతి థియేటర్ ప్రాంతానికి చెందిన శైలజకు రమణగుట్టకు చెందిన నల్లగట్ల సురేంద్రకుమార్‌తో 2019లో వివాహం జరగగా వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత ఏడాది అక్టోబర్ 9న రమణగుట్టలోని భవనం పైనుంచి పడిన శైలజ తీవ్రగాయాలు కాగా చికిత్స అనంతరం పుట్టింట్లో ఉంటోంది. అయితే, ఈనెల 11న వైద్యుల సలహా లేకుండా భర్త సురేంద్రకుమార్ శైలజకు సైలెన్‌లో ఇంజక్షన్ గుర్తుతెలియని ఇంజక్షన్ ఎక్కించగా ఆమె అపస్మాకరస్థితికి చేరడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే సురేంద్రకుమార్‌కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని తెలియటంతో మృతురాలి తల్లి నాగమణి తమ కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి తహసీల్దార్ సైదులు సమక్షాన మృతదేహన్ని బయటకు తీసి కొన్ని భాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు.


