రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టులుగా కొడంగల్, మధిర
● బోనకల్ మండలానికి రూ.306 కోట్ల నిధులు ● డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క
బోనకల్: ప్రతీ ఇల్లు, వ్యవసాయ పంపుసెట్లు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలుగా మారాలని.. తద్వారా ఆదాయం కూడా సమకురుతుందని లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం సోలార్ మోడల్ విలేజ్ పథకాన్ని ప్రవేశపెట్టిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. బోనకల్ మండలం రావినూతలలో సోమవారం సోలార్ విద్యుత్ మోడల్ విలేజ్ పథకాన్ని ఆయన ప్రారంభించారు. గ్రామంలోని పలువురి ఇళ్లపై ఏర్పాటుచేసిన సోలార్ ప్లేట్లను పరిశీలించాక సభలో భట్టి మాట్లాడారు. రాష్ట్రంలోని కొడంగల్, బోనకల్ మండలాల్లో పూర్తిగానే కాక ఇంకొన్ని గ్రామాల్లో ప్రతీ ఇల్లు, వ్యవసాయ పంపు సెట్‌కు సోలార్ విద్యుత్ ప్లాంట్లు బిగించేలా రూ.1,380 కోట్లు కేటాయించామని తెలిపారు. బోనకల్ మండలంలో 22 గ్రామాలకు రూ.306 కోట్లు, రావినూతలలో రూ.24 కోట్లు వెచ్చించినట్లు వెల్ల డించారు. ఈ ప్లాంట్లతో ఇంటికి కావాల్సిన విద్యుత్ ఉచితంగా అందడమే కాక మిగిలిన విద్యుత్ యూనిట్‌ను రూ.2.57 పైసల చొప్పున విద్యుత్ సంస్థలకు విక్రయిస్తే అదనపు ఆదాయం వస్తుందన్నారు. రైతుల వ్యవసాయ పంపుసెట్లకు రాష్ట్రప్రభుత్వ వ్యయంతో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఇస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలపైనా ఈ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళిక ఉందని భట్టి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి, రెడ్కో ఎండీ అనీల, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, కార్పొరేషన్ల చైర్మన్లు నాయుడు సత్యం, రాయల నాగేశ్వరావు, మధిర మార్కెట్, ఆత్మ కమిటీల చైర్మన్లు బండారు నర్సింహారావు, కర్నాటి రామకోటేశ్వరావు, సర్పంచ్ భూక్యా భద్రంతో పాటు కొండబాల కోటేశ్వరావు, పోట్ల నాగేశ్వరావు, గాలి దుర్గారావు, పైడిపల్లి కిశోర్, రామకృష్ణ, చేబ్రోలు వెంకటేశ్వర్లు, గుత్తా ద్రౌపతి, జానీ, సుబ్బారావు, మోదుగు సుధీర్‌బాబు, బందం శ్రీనివాసరావు, ఏమూన్ పాల్గొన్నారు.
రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టులుగా కొడంగల్, మధిర


