నారీమణులే న్యాయనిర్ణేతలు
మున్సిపాలిటీల వారీగా ఓటర్లు, వార్డుల వివరాలు
● అన్ని మున్సిపాలిటీల్లో మహిళా ఓటర్లే అధికం ● గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ● ఇప్పటినుంచే దృష్టి సారించిన ఆశావహులు
వైరా: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ నేడో, రేపో విడుదల అవుతుందున్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితా విడుదల చేయడమే కాక వార్డు, చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఇక షెడ్యూల్ విడుదల కావడమే తరువాయి కావడంతో ఆవాశములు వార్డుల వారీగా ఓటర్ల జాబితా పరిశీలిస్తూ బలాబలాలను అంచనా వేసుకుంటున్నారు. అయితే, జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. దీంతో అభ్యర్థుల గెలు పోటములను వీరే శాసించే అవకాశం ఉండడంతో నాయకులు మహిళా ఓటర్లపైనే దృష్టి సారించారు.
అన్ని చోట్ల అంతే...
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో మొత్తం 1,43,332 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 68,394 మంది కాగా, మహిళా ఓటర్లు 74,914 మంది ఉన్నట్లు తేలింది. దీంతో పురుషుల కంటే మహిళా ఓటర్లు 6,520 మంది అధికంగా ఉండడంతో కౌన్సిలర్లుగానే కాక చైర్మన్‌గా పోటీకి సిద్ధమవుతున్న వారు మహిళా ఓటర్లనే ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. అధికార కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం పలు పథకాలను అమలుచేస్తుండడం తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ నాయకులు ఆశల్లో ఉన్నారు. ఈనేపథ్యాన పార్టీ తరఫున నిర్వమించే ప్రతీ సమావేశానికి మహిళా సంఘాల సభ్యులను ఆహ్వానిస్తున్నారు. ఇటీవల మున్సిపాలిటీల పరిధిలో ఉన్న మెప్మా గ్రూపు సభ్యులకు ప్రభుత్వం కూడా వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తోంది. ప్రతీ మున్సిపాలిటీల్లో సుమారు 5వేల నుంచి 10 వేల మంది మహిళా గ్రూపుల సభ్యులు ఉంటారని అంచనా. ఏదులాపురంలో అత్యధికంగా మెప్మా గ్రూపులు ఉండడంతో బ్యాంకు లింకేజీ రుణాలు కూడా మిగిలిన నాలుగు మున్సిపాలిటీలతో పోలిస్తే అత్యధికంగానే మంజూరు చేయడం జరిగింది. ఇదే సమయాన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు.
మున్సిపాలిటీ మహిళలు పురుషులు ఇతరులు మొత్తం వార్డులు
ఏదులాపురం 23,511 21,742 03 45,256 32
సత్తుపల్లి 15,203 13,624 15 28,842 23
మధిర 13,424 12,251 04 25,679 22
వైరా 12,991 11,696 02 24,689 20
కల్లూరు 9,785 9,081 00 18,866 20
మొత్తం 74,914 68,394 24 1,43,332 117


