శిక్షణ తరగతులు ప్రారంభం
ఖమ్మం సహకారనగర్: జాతీయ విద్యా ప్రణాళిక పరిపాలన సంస్థ సహకారంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని కేజీబీవీల ప్రత్యేక అధికారులు, మోడల్ స్కూల్ హాస్టళ్ల కేర్ టేకర్లకు ఇస్తున్న శిక్షణ తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. ఖమ్మంలో ఈ తరగతులను డీఈఓ చైతన్య జైనీ ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థినుల వసతిగృహాల నిర్వహణలో ప్రత్యేక అధికారులు, కేర్ టేకర్ల పాత్ర, నిధుల వినియోగం, రక్షణ, సమాజ నిర్మాణంపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. నోడల్ ఆఫీసర్ రూబీ, కొత్తగూడెం జీసీడీఓ అన్నామణి, అధికారులు తులసి, అనిత, రామకృష్ణ, ప్రభాకర్‌రెడ్డి, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
రేపు జాబ్‌మేళా
ఖమ్మం రాపర్తినగర్: నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించేలా ఈనెల 21వ తేదీన జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి కొండపల్లి శ్రీరాం తెలిపారు. ఆటోమోటివ్ రంగంలో టెలీకాలర్, ఎలక్ట్రికల్ వెహికిల్ సర్వీస్ టెక్నీషియన్లు, అడ్వైజర్లు, సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లుగా నియామకం కోసం వీవీసీ డెవలప్‌మెంట్ సెంటర్ ఆధ్వర్యాన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఎస్సెస్సీ, డిప్లొమా, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత కలిగి 18 – 32 ఏళ్ల వయస్సు వారు ఖమ్మం ముస్తఫానగర్‌లోని వీవీసీ డెవలప్‌మెంట్ సెంటర్‌లో 21వ తేదీన జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు. వివరాలకు 96669 99503 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
మరో ఇద్దరికి పాలిగ్రాఫ్ పరీక్షలు
● ప్రశ్నల వర్షం కురిపించిన నిపుణులు
చింతకాని: చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన సీపీఎం నాయకుడు సామినేని రామారావు హత్య కేసు దర్యాప్తులో భాగంగా కాంగ్రెస్ నాయకులకు బెంగళూరులో పాలిగ్రాఫ్ పరీక్షలు కొనసాగుతున్నాయి. పాతర్లపాడుకు చెందిన ఆరుగురు నాయకులు పరీక్షకు అంగీకరించగా, ఈనెల 12న బెంగళూరు వెళ్లారు. శనివారమే గుగ్గిళ్ల రాధాకృష్ణ, కొత్తపల్లి వెంకటేశ్వర్లుకు పరీక్షను నిర్వహించగా, సోమవారం ఉదయం, మధ్యాహ్నం బొర్రా ప్రసాద్‌రావు, కంచుమర్తి రామకృష్ణకు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. సుమారు ఆరున్నర గంటల పాటు పరీక్షలో భాగంగా అక్కడి అధికారులు ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టినట్లు తెలిసింది. మిగతా ఇద్దరైన కాండ్ర పిచ్చయ్య, మద్దినేని నాగేశ్వరరావుకు మంగళవారం పరీక్ష నిర్వహించే అవకాశముంది.
వైద్యం పేరుతో
రూ.28 లక్షలు వసూలు
రఘునాథపాలెం: వనమూలికలతో కూడిన వైద్యం పేరుతో ఓ వ్యక్తిని నమ్మించి రూ.28 లక్షలకు పైగా వసూలు చేసిన ఘటన రఘునాథపాలెం మండలంలో వెలుగుచూసింది. బాధితుడి ఫిర్యాదుతో సోమవారం కేసు నమోదు చేశామని సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. ఖమ్మం–వైరా ప్రధాన రహదారిపై వీవీ.పాలెం వద్ద మహారాష్ట్రకు చెందిన వ్యక్తి గుడారం వేసుకుని ఆయుర్వేద వైద్యం చేస్తానని బోర్డు పెట్టాడు. అధిక వేడి తదితర సమస్యలతో ఆయనను చింతకాని మండలం కోమట్లగూడెంకు చెందిన ఐలూరు శ్రీనివాసరెడ్డి సంప్రదించగా ఇన్‌ఫెక్షన్ ఉన్నందున భవిష్యత్‌లో బోన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని భయపెట్టాడు. అలా జరగొద్దంటే మందులు వాడాలని చెబుతూ రూ.70 వేలతో మొదలుపెట్టి రూ.28 లక్షలు తీసుకున్నాడు. ఇందులో రూ.12.80 లక్షలు నిందితుడి ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేయగా, అనారోగ్య సమస్య తగ్గకపోవడంతో సంప్రదించాలని శ్రీనివాసరెడ్డి వెళ్లేసరికి గుడారం ఎత్తేశాడు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన ఆయన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీఐ ఉస్మాన్ షరీఫ్ వెల్లడించారు.
యువకుడిపై పోక్సో కేసు
ముదిగొండ: మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికకు మాయమాటలు చెప్పిన యువకుడు కిడ్నాప్ చేసి బలవంతం చేయబో యాడు. ఆమె కేకలు వేయడంతో పరారయ్యాడు. బాలిక కుటుంబీకుల ఫిర్యాదుతో గ్రామానికే చెందిన గోపిపై కిడ్నాప్, పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ అశోక్ తెలిపారు.


