బోనకల్: భర్త చనిపోయి దుఖఃలో ఉన్న ఆమెను అత్తామామలు, బావ, తోటికోడలు వేధిస్తుండగా ఇంటి ముందు బుధవారం ఆందోళనకు దిగింది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఖమ్మంకు చెందిన ఉద్యానశాఖ ఉద్యోగి కిల్లా రచనకు బోనకల్‌కు చెందిన బండి సురేష్‌తో 2022లో వివాహం జరిగింది. పెళ్లయిన కొన్నాళ్ల నుంచే బావ చిరంజీవి, తోటికోడలు కృష్ణప్రియాంక రచనను వేధిస్తుండగా, సురేష్ ఖమ్మంలో షాపు పెట్టుకున్నాడు. వీరిద్దరు ప్రతిరోజు బోనకల్ నుంచి ఖమ్మం వెళ్లివచ్చేవారు. ఆతర్వాత సురేష్ ఓ యాప్ ద్వారా రూ.2లక్షలు, ప్రైవేట్ పైనాన్స్ కంపెనీలో రూ.24 లక్షలు రుణం తీసుకోగా రచన ష్యూరిటీ సంతకం చేసింది. ఆపై బోనకల్ ఎస్‌బీఐలోనూ మరో రూ.10లక్షల రుణం తీసుకున్నప్పటి నుంచి సురేష్, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇంతలోనే ఈనెల 3వ తేదీన రాత్రి సురేష్ రైలు ప్రమాదంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన మరువకముందే అత్తామామలు విజయకుమారి, యాకూబ్, బావ, తోటికోడలు తనను వేధిస్తూ చంపేందుకు ప్రయత్నం చేస్తున్నారని రచన ఆరోపించింది. ఈమేరకు ఇంటిముందు ఆమె ఆందోళన చేస్తుండగా పోలీసుల జోక్యంతో స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తన భర్త మృతికి సైతం అత్తామామలు, తోటికోడలు, బావే కారణమని.. తనకు సైతం ప్రాణహానీ ఉందని ఫిర్యాదు చేసినట్లు రచన వెల్లడించింది.