మొదటి కల్యాణం గర్భగుడిలో... | Sakshi
Sakshi News home page

మొదటి కల్యాణం గర్భగుడిలో...

Published Wed, Apr 17 2024 12:35 AM

- - Sakshi

● రెండు గంటలకే పూజాదికాలు ప్రారంభం ● ఉదయం 8 గంటలకు లఘు కల్యాణం ● ఆ రోజుల్లో పొగడ చెట్టు నీడన.. ఇప్పుడు మిథిలా స్టేడియంలో

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సాధారణ రోజుల్లో తెల్లవారుజామున నాలుగు గంటల తర్వాత ఆలయంలో భద్రాచలంలో శ్రీరాముడిని సుప్రభాతంతో మేల్కొలుపుతారు. ఆ తర్వాత తిరువారాధన, మంగళశాసనం, అభిషేకం తదితర పూజాదికాలు నిర్వహిస్తారు. కానీ శ్రీరామ నవమి రోజున సీతారాముల వారిని రాత్రి రెండు గంటలకే మేల్కొల్పుతారు. ఆ తర్వాత నిత్యం నిర్వహించే పూజా కార్యక్రమాలు చేపడతారు. అనంతరం ఉదయం ఎనిమిది గంటల సమయాన గర్భగుడిలో ఉన్న మూల విరాట్‌లకు శాస్త్రోక్తంగా లఘు కల్యాణం జరుపుతారు. 40 నిమిషాల వ్యవధిలోనే ఈ పెళ్లి తంతు ముగుస్తుంది.

పెళ్లి పెద్దలుగా

శ్రీరామదాసు కాలం నుంచి భద్రాచలంలో నిత్య పూజలు, శ్రీరామనవమి, పట్టాభిషేకం తదితర వేడుకలు నిర్వహించేందుకు తమిళనాడులోని శ్రీరంగానికి చెందిన వేద పండితులను శ్రీరామదాసు భద్రాచలం తీసుకొచ్చారు. ఇలా వచ్చిన వారిలో కోటి, అమరవాది, పొడిచేటి, గొట్టుపుళ్ల, తూరుబాటి కుటంబాలు ఉన్నాయి. అప్పటి నుంచి నేటి వరకు వంశపారంపర్యంగా వీళ్లే ఈ బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. ఇందులో నవమి వేడుకల బాధ్యతలను వంతుల వారీగా ఈ కుటుంబాలు నిర్వహిస్తుంటాయి. శ్రీరామ నవమికి మిథిలా స్టేడియంలో జరిగే శ్రీ సీతారాముల కలా్యాణం, పట్టాభిషేక మహోత్సవాల్లో కీలక పాత్ర పోషించేది ఆచార్య. ఈయన చేతుల మీదుగానే కల్యాణం మొత్తం జరుగుతుంది. ఆయనకు సూచనలు చేసే వ్యక్తిని బ్రహ్మగా పేర్కొంటారు. వీరిద్దరికి సహాయకులుగా ఇద్దరు చొప్పున నలుగురు రుత్వికులు ఉంటారు. వీరికి పూజా సామగ్రి అందించేందుకు ఇద్దరు చొప్పున నలుగురు పరిచారకులు ఉంటారు. ప్రస్తుతం ఆలయంలో ప్రధాన అర్చకులైన ఇద్దరు వీరందరికీ ఆధ్వర్యులుగా వ్యవహరిస్తారు. మొత్తంగా పన్నెండు మంది సీతారాముల పెళ్లి వేడుకలో కీలకంగా వ్యవహరిస్తారు. వీరందరిని ఉత్సవాల్లో భాగస్వామ్యం చేస్తూ ఈ కళ్యాణ తంతు శాస్తోక్తంగా, సంప్రదాయబద్ధంగా పూర్తి చేసేలా స్థానాచార్యులు స్థలశాయి ‘పెద్ద పాత్ర’ నిర్వర్తిస్తారు.

నాడు పొగడ చెట్టు నీడలో

శ్రీరామదాసు కాలంలో భద్రాచలం ఆలయం ప్రాంగణంలో ఉన్న పొగడ చెట్టు నీడలో సీతారాముల కల్యాణం నిర్వహించేవారని పండితులు చెబుతారు. ఆ తర్వాత కాలంలో భక్తుల సంఖ్య పెరగడంతో పొగడ చెట్టు నుంచి బేడా మండపంలోకి పెళ్లి వేదికను మార్చారు. గోదావరిపై వంతెన నిర్మాణం పూర్తయ్యాక భద్రాచలం వచ్చే భక్తుల సంఖ్య వేలల్లోకి చేరింది. బేడా మండపంలో అంతమంది పెళ్లి చూడటం కష్టం కావడంతో ఆలయ ప్రాంగణం బయట కల్యాణం జరిపించాలని నిర్ణయించారు. దీంతో ఉత్తర ద్వారానికి ఎదురుగా నవమి కల్యాణం కోసం ప్రత్యేకంగా మండపాన్ని 1964లో నిర్మించారు. సుమారు రెండు దశాబ్దాల పాటు ఎత్తయిన కల్యాణ మండపంలో పెళ్లి తంతు జరుగుతుంటే చుట్టూ భక్తులు చేరి చూసేవారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయాన 1988లో కల్యాణ మండపం చుట్టూ భక్తులు కూర్చుని చూసేందుకు వీలుగా మిథిలా స్టేడియాన్ని నిర్మించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement