
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న ఎర్రుపాలెం మండలం జమలాపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునే శ్రీవారికి అర్చకులు సుప్రభాత సేవ, పంచామృతంతో అభిషేకం నిర్వహించడమే కాక స్వామి, అమ్మ వార్లను అలంకరించి వేపపూవు ప్రసాదాన్ని నివేదించారు. ఆ తర్వాత ఆలయ పుష్కరిణి నుంచి ఈఓ కె.జగన్మోహన్‌రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, అర్చకులు, సిబ్బంది మేళతాళాల నడుమ తీర్థపు బిందె, పట్టు వస్త్రాలను యాగశాలకు తీసుకొచ్చారు. అక్కడ ఉగాది సందర్భంగా అర్చకులు కురివి వెంకట సుబ్రహ్మణ్యశాస్త్రి పంచాగ శ్రవణం చేయగా.. శ్రీవారి నిత్యకల్యాణాన్ని నిర్వహించారు. కాగా, బ్రహ్మోత్సవాల తొలిరోజు ఉగాది పర్వదినం కావడంతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన పది వేలమందికి పైగా భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ధర్మకర్తలు ఉప్పల కృష్ణమోహన్‌శర్మ, ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ఉద్యోగులు, అర్చకులు శ్రీనివాస్, విజయకుమారి, విజయదేవశర్మ తదితరులు పాల్గొన్నారు.
