కెలమంగలం: డెంకణీకోట తాలూకా తళి సమీపంలోని కర్ణాటక సరిహద్దు దేవరబెట్ట కొండపైకి ఉన్న మెట్లపైకి నాలుగు ఏనుగులు వచ్చాయి. కొండను ఎక్కుతూ స్థానికుల కంటబడ్డాయి. దేవరబెట్ట కొండపై ప్రసిద్ధి పొందిన శివాలయం ఉంది. ఈ ఆలయానికి నిత్యం తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు, పర్యాటకులు వెళ్లి స్వామివారిని దర్శించుకొంటున్నారు. బుధవారం ఉదయం 4 ఏనుగులు కర్ణాటక అటవీ ప్రాంతం నుంచి కొండ పైభాగానికి చేరుకోవడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొండపైకి ఏనుగులు రావడం ఇదే మొదటిసారిగా అని స్థానికులు తెలిపారు. అటవీ సిబ్బంది చేరుకొని ఏనుగులను దూరంగా మళ్లించారు.
హఠాత్తుగా కుంగిన భూమి
దొడ్డబళ్లాపురం: ఉత్తర కర్ణాటక జిల్లాల్లో తరచూ భూ ప్రకంపనలు రావడంతో ప్రజల్లో భీతి నెలకొంది. మరోవైపు బాగలకోట జిల్లా ముధోళ తాలూకా నింగాపుర గ్రామంలో హఠాత్తుగా భూమి కుంగిపోవడంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. గ్రామ శివారులో ఉన్న చెరుకు తోటలో 20 అడుగుల లోతు, 10 అడుగుల వెడల్పున భూమి కుంగి గుంతలు ఏర్పడ్డాయి. ఇదే ఇళ్ల మధ్యలో జరిగి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేదన్నారు. అధికారులు ఆ స్థలాన్ని పరిశీలించారు.
ఊరికి వెళ్తే డబ్బు, నగలు మాయం
మైసూరు: మైసూరు నగరంలో మళ్లీ దొంగల బెడద పెరిగిపోయింది. ఎన్‌ఆర్ మొహల్లాలో ఓ ఇంటిలోకి జొరబడిన దొంగలు 44 గ్రాముల వివిధ రకాల బంగారు ఆభరణాలు, రూ.40 వేల నగదును ఎత్తుకెళ్లారు. మొహల్లాలో శివాజీ రోడ్డు 4వ క్రాస్ నజీబుర్ రెహమాన్ భార్యతో కలిసి ఇంటికి తాళం వేసుకుని కనకపురకు వెళ్లాడు. వాపసు ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో భద్రపరిచిన బంగారు నగలు, డబ్బు కనబడలేదు. బంగారు నెక్లెస్, పెండెంట్, మూడు జతల కమ్మలు, నాలుగు ఉంగరాలు, రూ.40 వేల నగదును చోరీ అయినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఎబోలాపై మళ్లీ అలర్ట్
బనశంకరి: ఆఫ్రికా ఖండంలో ప్రాణాంతక ఎబోలా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మరోసారి అలర్ట్‌ను జారీచేసింది. రాష్ట్రంలోని అన్ని వైద్యాలయాల్లో ఎబోలా రోగ లక్షణాలు కలిగిన రోగులపై నిఘా పెట్టాలని ఆదేశించింది. బెంగళూరు, మంగళూరుతో సహా పలు నగరాల్లో బాధితుల కోసం ప్రత్యేక క్వారంటైన్ వార్డులను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఎబోలా అనుమానిత కేసు వస్తే ఆరోగ్యశాఖ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి. రక్త నమూనాలను బెంగళూరులోని నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించాలి. అక్కడి నుంచి పూణేలోని ఐసీఎంఆర్–ఎన్‌ఐవీ కేంద్రానికి పంపిస్తారు.
హస్తం ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే
బనశంకరి: ఎమ్మెల్యేల కోటాలో జరిగే విధాన పరిషత్ ఎన్నికలకు నలుగురు అభ్యర్దులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. బీకే.హరిప్రసాద్, పీపీ.మోహన్, తిమ్మప్ప కమకనూరు, మళవళ్లి శివణ్ణ అభ్యర్థులు. హరిప్రసాద్, తిమ్మప్పను మళ్లీ ఎమ్మెల్సీలుగా ఎంపిక చేశారు. వీరిలో శివణ్ణ సీఎం డీకే శివకు ఆప్తుడు. బలం ఉన్నందున ఈ స్థానాలను కాంగ్రెస్ గెలుస్తుంది.
పంచాయితీల్లో సోదాలు
మండ్య: ఉప లోకాయుక్త బి.వీరప్ప ఆదేశాల మేరకు మండ్య లోకాయుక్త పోలీసులు బుధవారం బేళూరు, బేవినహళ్లి గ్రామ పంచాయతీ పీడీఓల ఇళ్లు, పంచాయతీ కార్యాలయం, టీపీ ఈఓ ఆఫీసులో సోదాలు జరిపారు. 15 రోజుల క్రితం ఉప లోకాయుక్తా బి.వీరప్ప బేలూరు, బేవినహళ్లి గ్రామ పంచాయతీలలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ–స్వత్తు, పన్ను సేకరణ, లేఔట్ రుసుం, ఫిర్యాదుల గురించి పట్టించుకోక పోవడం వంటివి గుర్తించారు. ఈ నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.


