1.8 కేజీల బంగారు నగల దోపిడీ | - | Sakshi
Sakshi News home page

1.8 కేజీల బంగారు నగల దోపిడీ

May 21 2026 4:51 AM | Updated on May 21 2026 4:51 AM

బెంగళూరు మల్లేశ్వరంలో ఘటన

యశవంతపుర: కొనుగోలు సాకుతో రూ.3 కోట్ల విలువగల బంగారు నగలను దోచేశారు. ఈ సంఘటన బెంగళూరులోని మల్లేశ్వరంలో జరిగింది. నగర్త పేటలో ప్రసిద్ధి చెందిన మెమతా జువెలరీస్‌ షాపు యజమాని నుంచి 1.8 కేజీల బంగారాన్ని దుండగులు కాజేశారు. వివరాలు.. యజమానికి పరేశ్‌ సోని అనే వ్యక్తి ఫోన్‌ చేసి తమకు ఓ సంస్థ ఉందని, హోల్‌సేల్‌గా బంగారాన్ని కొంటామని నమ్మించి తమ ఆఫీసుకు రావాలన్నారు. తమకు 3 కేజీల అభరణాలు కావాలని చెప్పారు. మల్లేశ్వరంలో మాహి ఎంటర్‌ప్రైజెస్‌ అని ఓ ఆఫీసుకు నకిలీ బోర్డు వేసి అక్కడికి పిలిపించారు. యజమాని, అతని మేనేజర్‌ నగలను తీసుకొచ్చారు. మోసగాళ్లు ఆభరణాల డిజైన్లను పరిశీలిస్తామంటూ కొన్ని నగలను పక్క గదిలోకి తీసుకెళ్లి అక్కడి నుంచి నుంచి ఉడాయించారు. గదిలోకి వెళ్లినవారు ఎంతసేపటికీ రాకపోవటంతో అనుమానం వచ్చి చూడగా ఎవరూ లేరు. ఫిర్యాదు మేరకు శ్యామ్‌, రామచంద్ర, పరేశ్‌ సోనిలపై మల్లేశ్వరం పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.

మెట్రో చార్జీల పెంపు లేనట్టే

శివాజీనగర: నిత్యం లక్షలాది మంది ప్రయాణించే బెంగళూరు మెట్రో రైలు టికెట్‌ రేట్లను పెంచడం లేదని తెలిసింది. ఇటీవల జరిగిన బోర్డు మీటింగ్‌లో బీఎంఆర్‌సీఎల్‌ అధికారులు చార్జీల పెంపు గురించి ప్రస్తావించారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు దీనిపై మరింత చర్చ జరగాలని సూచించారు. దీంతో చార్జీల పెంపు కొంతకాలం లేనట్లేనని సమాచారం.

పరప్పనలో వదంతుల గోల

యశవంతపుర: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో జైల్లో ఉన్న ఓ ప్రముఖ నిందితుడు సుప్రీంకోర్టు బెయిల్‌ నిరాకరించిన తరువాత ఆత్మహత్యకు యత్నించిన్నట్లు వచ్చిన వార్తలు గుప్పుమన్నాయి. సుమారు రెండేళ్లుగా జైల్లో ఉండడం, బెయిలు రాకపోవడంతో విరక్తి చెంది ఆత్మహత్యాయత్నం చేశాడని వదంతులు వ్యాపించాయి. ఆందోళన చెందిన అభిమానులు పరప్పన అగ్రహారలోని సెంట్రల్‌ జైలుకు పరుగులు తీశారు. ఇది తెలిసి జైళ్ల శాఖ చీఫ్‌ అలోక్‌కుమార్‌ జైలును సందర్శించారు. ఇదంతా అవాస్తవమని, ఎవరూ ఆందోళన చెందరాదని ఆయన ప్రకటించారు. నిందితులు ఆరోగ్యంగా ఉన్నారని, ఎవరూ భయపడరాదన్నారు.

వేలాది టీచర్‌ పోస్టుల భర్తీ!

నివేదికకు సీఎం సూచన

శివాజీనగర: రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 15 వేల మంది ఉపాధ్యాయులను భర్తీ చేసే ప్రతిపాదనలను సమర్పించాలని సీఎం సిద్దరామయ్య ఆర్థిక శాఖను ఆదేశించారు. విద్యాశాఖ గురించి తమ నివాసంలో విద్యామంత్రి మధు బంగారప్ప, సీనియర్‌ అధికారులతో భేటీ నిర్వహించారు. నాణ్యమైన విద్య, ఉపాధ్యాయుల కొరత తదితరాలపై చర్చించారు. ఎల్‌కేజీ నుంచి పీయూసీ వరకు ఒకే ఆవరణలో కన్నడ, ఇంగ్లీష్‌ రెండు భాషలలో విద్య లభించే కర్ణాటక పబ్లిక్‌ స్కూల్‌ (కేపీఎస్‌) పథకాన్ని జూన్‌ 1న శివమొగ్గలో ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ ఏడాది నుంచి బడుల్లో ఉచిత పాఠ్య పుస్తకాలతో పాటు నోటు పుస్తకాలను అందిస్తారు. టెన్త్‌, ఇంటర్‌లో మెరుగైన ఉత్తీర్ణత సాధించారని సీఎం అభినందించారు.

కట్టెల లారీ బీభత్సం

బైకిస్టు మృతి

తుమకూరు: బైక్‌ను లారీ ఢీ కొనడంతో ద్విచక్రవాహనదారుడు మరణించాడు. ఈ ఘటన కొరటెగెరె పట్టణం వడ్డెగెరె వద్ద బుధవారం సాయంత్రం జరిగింది. మృతుడు మధుగిరి తాలూకా దొడ్డహోసహళ్లికి చెందిన తిమ్మణ్ణ (47). తిమ్మణ్ణ, మహిళ బైక్‌లో వస్తుండగా, కొరటెగెరె సౌదే మండి ముబారక్‌కు చెందిన లారీ కట్టెల లోడుతో వస్తూ, ముందు వెళ్తున్న బైక్‌ని ఢీకొట్టింది. తరువాత రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. తిమ్మణ్ణ తీవ్ర గాయాలతో అక్కడే చనిపోగా, మహిళకు గాయాలయ్యాయి. మృతుడు తిమ్మణ్ణ కొరటెగెరెలో రోడ్డు పక్కన టీ, కొబ్బరికాయలు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. లారీ డ్రైవర్‌ అనిల్‌ కూడా గాయపడ్డాడు. లారీ డ్రైవర్‌ మద్యం మత్తులో డ్రైవింగే ప్రమాదానికి కారణమని తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement