మైసూరు: ఇచ్చిన రుణం రూ.55 లక్షలను తిరిగి ఇవ్వాలని అడిగేందుకు వెళ్తే ఎమ్మెల్సీ హెచ్. విశ్వనాథ్ దాడి చేశారని కాంగ్రెస్ నేత ఆరోపించారు. నేతలందరికీ నీతులు చెప్పే విశ్వనాథ్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. వివరాలు.. మైసూరులోని జలదర్శినిలో హెచ్.విశ్వనాథ్ ఉండగా డబ్బు అడిగేందుకు వెళ్లగా దూషించి దాడి చేశారని కాంగ్రెస్ నాయకుడు కోటెహుండి మహదేవు ఆరోపించారు. 2013లో విశ్వనాథ్ ఎంపీగా ఉండగా కోటెహుండి మహదేవు.. ఎంటీబీ నాగరాజ్ ద్వారా విశ్వనాథ్, అతని కుమారుడు అమిత్ దేవరహట్టిలకు రూ.55 లక్షల అప్పు ఇచ్చా, కానీ ఇంతవరకు డబ్బు వాపసు ఇవ్వలేదని మహదేవు చెబుతున్నారు. 2026 ఫిబ్రవరిలో విశ్వనాథ్ జలదర్శినిలో ఉండగా డబ్బులు అడిగేందుకు వెళ్లగా తిట్టి తలపై కొట్టారన్నారు. దేవరాజ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశా, తరువాత కోర్టుకు వెళ్లి కేసు నమోదుకు ఆదేశాలు తెచ్చా, ఈ నేపథ్యంలో విశ్వనాథ్‌పై ఎఫ్‌ఐఆర్ దాఖలైందని చెప్పారు.
నాపై కేసు వెనుక సీఎం తనయుడు
మైసూరు: తనపై నమోదైన కేసు వెనుక సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర హస్తం ఉందని ఎమ్మెల్సీ హెచ్.విశ్వనాథ్ ఆరోపించారు. మహదేవు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించడంపై స్పందించారు. తనకు ఇవ్వడానికి మహదేవుకు రూ. 55 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. తాను ఎప్పుడూ డబ్బుల వ్యవహారం నడపలేదని, నా పరువుకు భంగం కలిగించేందుకు సీఎం కుమారుడు ఇలా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో పోలీసులు నోటీసులు ఇచ్చారని, సమాధానం ఇస్తానని చెప్పారు.
సీఎం కుమారునిపై ఎమ్మెల్సీ విమర్శలు


