హొసపేటె: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలహీనపడుతోందని, తన ముఖ్యమంత్రి పీఠాన్ని పదిలం చేసుకోవడానికి తాను హిందూయేతర నాయకుడినని సీఎం సిద్దరామయ్య చెప్పుకుంటున్నారని మాజీ మంత్రి బీ.శ్రీరాములు పేర్కొన్నారు. బుధవారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. తాను ఢిల్లీకి వెళ్లి ఒక హిందూయేతర సదస్సు నిర్వహిస్తానని ముఖ్యమంత్రి సిద్దరామయ్య చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆసలు ఏ ఉద్దేశంతో ఆయన ఆ హిందూయేతర సదస్సు పెడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈరోజు ఒక మాట మాట్లాడి, రేపు మరొక మాట మార్చే ముఖ్యమంత్రిగా మారిపోయారన్నారు. కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలోనే కూర్చుని, తాము ఢిల్లీకి వెళ్లి హిందూయేతర సదస్సు నిర్వహిస్తామని చెబుతున్నారు. రాష్ట్రంలో నీటి కొరతతో పాటు తీవ్రమైన ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పశువులు, మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయన్నారు.
అనుమతి లేకుండానే చెట్ల నరికివేత
బళ్లారి నగరంలో ఎటువంటి అనుమతి లేకుండానే యథేచ్ఛగా చెట్లను నరికి వేస్తున్నారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించిందన్నారు. బళ్లారిలో అనుమతి లేకుండా చెట్లను నరికివేస్తున్న ఘటనపై తాను ఫిర్యాదు చేస్తానన్నారు. రిజర్వేషన్ల విషయంలో అన్యాయం జరుగుతోందన్నారు. ఈ అంశంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలను మోసం చేశారన్నారు. వీఎస్ ఉగ్రప్ప తమ మామ వంటివారు. ఉగ్రప్ప మామా.. మీరు నిజం మాట్లాడాలన్నారు. రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ పార్టీ సభ్యులు నిజం చెప్పాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల ప్రక్రియ విజయవంతమైందని చెబుతూ మంత్రి ప్రియాంక్ ఖర్గే స్వీట్లు పంచడం సమంజసం కాదన్నారు. ప్రజల ఆగ్రహానికి గురై కాంగ్రెస్ పార్టీ సర్వనాశమైపోతుందని జోస్యం చెప్పారు.
మాజీ మంత్రి శ్రీరాములు


