బళ్లారిటౌన్: తాలూకాలోని కుడితిని వద్ద రోడ్డుపై ధర్నా చేస్తున్న వందలాది మంది రైతులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. కుడితిని వద్ద పరిశ్రమల నిర్మాణం కోసం కేఐఏడీబీ స్వాధీనం చేసుకున్న భూములకు న్యాయపరమైన ధరలు ఇవ్వాలి. పరిశ్రమలను ప్రారంభించి భూమి కోల్పోయిన రైతు కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలి. లేదా భూములనైనా వాపసు ఇవ్వాలనే డిమాండ్‌తో రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. దాదాపు 900 ఎకరాల భూములను జిందాల్, మిత్తల్ కంపెనీ, జేఎఫ్ కంపెనీల కోసం కేఐఏడీబీ స్వాధీనం చేసుకుంది. దీంతో రైతులు పోరాటాలకు దిగినందున తమ పైకోర్టులో తప్పుడు కేసులను దాఖలు చేసిందని రైతు సంఘాల నేతలు ఆరోపించారు.
144 సెక్షన్ విధింపు ఖండనీయం
తాము న్యాయసమ్మతంగా పోరాటాలు చేస్తున్నా కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి 144 సెక్షన్ విధించడం ఖండనీయం అన్నారు. రైతులకు అండగా నిలవాల్సిన అధికారులు పారిశ్రామికవేత్తలకు అండగా నిలిచి తమపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని అన్నారు. గత 1227 రోజుల నుంచి ఈ పోరాటాలు చేస్తున్న రైతులపై అధికారులు కనికరం చూపడం లేదని పేర్కొన్నారు. రైతు సంఘాల నేతలు యూ.బసవరాజ్, జే.సత్తిబాబు, ఎం.తిప్పేస్వామి, జంగ్లి సాబ్, శ్రీధర్, నరసింహ రాజు, తిమ్మప్ప, మహారుద్ర గౌడ, సురేష్‌గౌడ తదితరులు పాల్గొన్నారు.
కుడితిని వద్ద పోరాటం
ఆందోళనకారుల అరెస్టు


