శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలోని త్యావరెకొప్ప పులి–సింహాల అభయారణ్యంలో యువ పశు వైద్యురాలు సమీక్షారెడ్డి మృతికి కారణమైన హంసిని (12) అనే ఆడ నీటి ఏనుగు (హిప్పో పోటామస్) మంగళవారం అనారోగ్యంతో మరణించింది. గర్భంతో ఉన్న హిప్పో గడువు దాటినా ప్రసవం కాలేదు. దీంతో 10వ తేదీన పశువైద్యులు దానికి వైద్య పరీక్షలు చేశారు. హంసిని గర్భాశయంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తేలింది. గర్భాశయంలోనే పిండం చనిపోయి ఉందని తేలింది. అప్పటి నుంచి చికిత్స అందిస్తున్నా ఇన్పెక్షన్ ఇతర అవయవాలకు వ్యాపించి మధ్యాహ్నం 3:30 గంటలకు మరణించిందని అటవీ ఉన్నతాధికారులు తెలిపారు. కొన్నివారాల కిందట ఈ హిప్పోకు వైద్యం చేస్తున్న బెంగళూరు పశువైద్యురాలు సమీక్షారెడ్డిపై అది దాడి చేయడంతో ఆమె తీవ్ర గాయాలతో మరణించడం తీవ్ర సంచలనం కలిగించింది.
బస్సులో రూ.4 లక్షల నగల చోరీ
మైసూరు: ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తున్న మహిళ వ్యానిటీ బ్యాగ్ నుంచి ఇద్దరు గుర్తు తెలియని మహిళలు రూ.4 లక్షల విలువైన బంగారు నగలను దోచేశారు. వివరాలు.. నంజనగూడువాసి గౌరమ్మ మైసూరులో బంధువుల పెళ్లికి వచ్చింది. తరువాత జాకీ క్వార్టర్స్ వద్ద పుట్టేగౌడన హుండికి వెళ్లే ప్రైవేట్ బస్సు ఎక్కింది. ఆ సమయంలో ఆమె పక్కనే ఇద్దరు గుర్తు తెలియని మహిళలు కూర్చొన్నారు. కొంతసేపటికి దిగిపోయారు. మరో స్టాప్ వద్ద దిగిన గౌరమ్మ బ్యాగు చూసుకోగా బంగారం కనిపించలేదు. దీంతో వెంటనే ఓ ఆటోలోనే ఆ బస్సును అనుసరిస్తూ వెళ్లి టీ.నరసీపుర వద్ద బస్సును ఆపి పరిశీలించగా ఆ మహిళలు కనబడలేదు. కండక్టర్‌ను విచారించగా వారిద్దరూ మేగళాపుర వద్ద బస్సు దిగారని చెప్పాడు. బాధితురాలు వరుణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
టూర్‌కి వెళ్లగా, ఇల్లు గుల్ల
తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడిన దొంగలు వార్డు రోబ్‌లో ఉన్న రూ.2.76 లక్షల విలువైన బంగారు నగలను ఎత్తుకెళ్లారు. మైసూరులోని హళె కెసరె వద్ద ఉన్న టీచర్ బడావణె నివాసి మహేష్‌రావ్, కుటుంబంతో కలిసి ధర్మస్థల, ఉడుపి ప్రాంతాల టూర్‌కి వెళ్లారు. మూడో రోజు మహేష్ సోదరుడు రాకేష్ ఇంటి వద్దకు వెళ్లి చూడగా తలుపులు పగలగొట్టి ఉండడంతో చోరీ బయటపడింది. నరసింహరాజ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఊయలే ఉరితాడై.. బాలిక మృతి
యశవంతపుర: ఇంటిలో సరదాగా ఊయల ఊగుతుండగా గొంతుకు బిగుసుకుని లేఖన (10) అనే చిన్నారి ఊరిపి తీసింది. చిక్కమగళూరు తాలూకా హెబ్బళ్లి గ్రామంలో జరిగింది. బాలిక ఇంటిలో తల్లిదండ్రులు లేని సమయంలో చీరతో ఊయల కట్టుకుని ఊగుతోంది. అయితే చీర కాలుకు చుట్టుకుని గొంతుకు బిగుసుకుంది. దీంతో ఉపిరాడక చిన్నారి మరణించింది. ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు కూతురిని అలా చూసి కన్నీరుమున్నీరయ్యారు. చిక్కమగళూరు గ్రామాంతర పోలీసులు కేసు నమోదు చేశారు.
తల్లి రాతి హృదయం
● కుమార్తెను చంపి, ఆపై ఆత్మహత్య
● బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లో విషాదం
బనశంకరి: ఏం కష్టం వచ్చిందో గానీ కూతురిని చంపి, ఆపై తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఎంత ఆపద వచ్చినా పిల్లలను కాపాడుకోవాల్సిన అమ్మ గుండె రాతిగా మారింది. ఈ దుర్ఘటన సిలికాన్ సిటీలో వైట్‌ఫీల్డ్ ఠాణా పరిధిలోని ఇమ్మడిహళ్లిలో మంగళవారం సాయంత్రం వెలుగుచూసింది. వివరాలు.. సువర్ణ (40), ఆమె కుమార్తె కారుణ్య (14) మృతులు. ఓ ఇంటిలో సువర్ణ కుటుంబం నివసిస్తోంది. మొదట కుమార్తెను గొంతుపిసికి చంపింది, ఆపై ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం నుంచి ఇంట్లో అలికిడి లేకపోవడంతో ఇరుగు పొరుగుకు అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా ఏదో జరిగినట్లు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు తలుపులు బద్ధలు కొట్టి చూడగా తల్లీ కూతురు శవాలు కనిపించాయి. క్లూస్ టీంతో ఆధారాల కోసం గాలించారు. అక్కడ ఎలాంటి డెత్‌నోట్ దొరకలేదని సమాచారం.
కారణాలపై సందిగ్ధం
మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారణాలపై బంధుమిత్రులను విచారిస్తున్నారు. కుటుంబ సమస్యలా, ఆర్థిక ఇబ్బందులా, లేక మరేమైనా ఉన్నాయా? అనేది తేలాల్సి ఉంది. ఈ దుర్ఘటనతో ఇమ్మడిహళ్లిలో విషాదం నెలకొంది.


