బళ్లారిలో అంబేడ్కర్ ప్రతిమకు మాజీ ఎమ్మెల్యే సోమశేఖర్‌రెడ్డి పుష్పాంజలి
బళ్లారిలో అంబేడ్కర్ ప్రతిమకు గ్రామీణ ఎమ్మెల్యే నాగేంద్ర పుష్పాంజలి
బళ్లారిలో అంబేడ్కర్ చిత్రపటానికి ఎమ్మెల్యే భరత్‌రెడ్డి నమస్సుమాంజలి
సాక్షి,బళ్లారి: బడుగుల ఆశాజ్యోతి డాక్టర్ భీమ్‌రావ్ అంబేడ్కర్ జయంతి కేవలం ఒక వేడుక కాదు, సమానత్వం, సామాజిక న్యాయం, హక్కుల పరిరక్షణకు గుర్తు అని పలువురు వక్తలు కొనియాడారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా వేడుకగా నిర్వహించారు. హొసపేటె రోడ్డులోని అంబేడ్కర్ భవన్ వద్ద డాక్టర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహానికి నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, గ్రామీణ ఎమ్మెల్యే బీ.నాగేంద్ర, జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్, ఎస్పీ సుమన పన్నేకర్, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, మాజీ మేయర్ వెంకటరమణ, మేయర్ గాదెప్ప, లిడ్కర్ అధ్యక్షుడు ముండ్రగి నాగరాజు తదితర ప్రముఖులు, దళిత సమాజ ప్రముఖుడు హనుమంతప్ప, పలువురు కార్పొరేటర్లు, దళిత సమాజ నాయకులు, డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్ పూల మాలలు వేసి నివాళి అర్పించారు. అంతకు ముందు బైక్ ర్యాలీతో పాటు అంబేడ్కర్ చిత్రపటాన్ని భారీ ఊరేగింపు చేపట్టి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, జానపద నృత్యాలు చేస్తూ సంబరాల్లో మునిగితేలారు.
అంబేడ్కర్ అడుగు జాడల్లో నడుద్దాం
హొసపేటె: విజయనగర జిల్లా హొసపేటె నగరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అంబేడ్కర్ సర్కిల్‌లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతి నిర్వహించారు. మంగళవారం అంబేడ్కర్ ప్రతిమకు జిల్లాధికారి కవిత ఎస్.మన్నికేరి నివాళి అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బాల్యం నుంచి సమాజంలో వివక్షత కారణంగా ఎన్నో సవాళ్లను అంబేడ్కర్ ఎదుర్కొన్నారన్నారు. అయినా తన కలలను, ఆశయాలను ఎన్నడూ వీడలేదన్నారు. విజయానికి విద్య కీలకం అని బలంగా విశ్వసించారన్నారు. జెడ్పీ సీఈఓ మహమ్మద్ అక్రమ్ నోంగ్‌జాయ్ షా, ఎస్పీ జాహ్నవి, అసిస్టెంట్ కమిషనర్ వివేక్, అధికారులు మనోహర్, ఎర్రగుడి శివకుమార్, తహసీల్దార్ శృతి, అంబేడ్కర్ సంఘం నేతలు వీరస్వామి, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.
దేశ భవిష్యత్తుకు అంబేడ్కర్ ఆలోచనలు కీలకం
ఆధునిక భారత దేశ పునర్ నిర్మాణానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆలోచనలు కీలకం అని హంపీ కన్నడ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ డీవీ పరమ శివమూర్తి తెలిపారు. హంపీలోని కన్నడ విశ్వవిద్యాలయం క్రియాశక్తి భవనంలోని సిండికేట్ హాల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం మాట్లాడారు. దేశ ఆర్థిక, సామాజిక, మతపరమైన వ్యవస్థలపై ఆయన సూత్రాలు గణనీయమైన ప్రభావాన్ని చూపాయన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ విరుపాక్షి పూజారహళ్లి, ఉపకులపతి గురుబసప్ప, విద్యార్థులు పాల్గొన్నారు.
రాయచూరులో..
రాయచూరు రూరల్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతిని ఘనంగా ఆచరించారు. సోమవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద అంబేడ్కర్ ప్రతిమకు ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్, మాన్విలో శాసన సభ్యుడు హంపయ్య నాయక్, దేవదుర్గలో శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, ఎస్పీ అరుణాంగ్శు గిరి పూలమాలలు వేసి బుద్ధం శరణం గచ్ఛామి పంచాంగాన్ని పఠించారు.
పార్టీ కార్యాలయంలో..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతిని పార్టీ నేతలు సరళంగా జరిపారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లాధ్యక్షుడు బసవరాజ్ పాటిల్ ఇటగి, బీజేపీ కార్యాలయంలో అధ్యక్షుడు వీరనగౌడ, శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ పూలమాలలు వేశారు. అంబేడ్కర్ సర్కిల్ వద్ద ప్రతిమకు ఎస్‌డీపీఐ సభ్యులు సయ్యద్ ఇషాఖ్ హుసేనీ పూలమాల వేసి నివాళి అర్పించారు.
బడుగు వర్గాల ఆశాకిరణం
సమాజంలో బడుగు, దళిత వర్గాల ఆశాకిరణం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ అభిప్రాయపడ్డారు. మంగళవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో 135వ అంబేడ్కర్ జయంతిని ప్రారంభించి మాట్లాడారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కోసం జీవితాంతం పోరాటం చేసిన మహా యోధుడన్నారు. ప్రపంచ మేధావుల్లో ఒకరని, అంబేడ్కర్ ఆశయ సాధనకు అందరం కృషి చేద్దామన్నారు. ఎస్పీ అరుణాంగ్శు గిరి, కమిషనర్ జుబిన్ మహాపాత్రో, ఏసీ హంపణ్ణ, తహసీల్దార్ సురేష్ వర్మ, ఏడీసీ శివానంద, కృష్ణలున్నారు.
వివక్షతపై గళమెత్తి
విజయం సాధించిన మహోన్నతుడు
సమానత్వం కోసం పోరాడిన
మహానుభావుడు
అంబేడ్కర్ 135వ జయంతిలో పలువురు వక్తల ప్రశంసలు


