రెండు లారీలు ఢీ.. ఇద్దరు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రెండు లారీలు ఢీ.. ఇద్దరు దుర్మరణం

Apr 15 2026 7:56 AM | Updated on Apr 15 2026 7:56 AM

సాక్షి,బళ్లారి: చిత్రదుర్గ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.మంగళవారం చిత్రదుర్గ జిల్లా భరమసాగర సమీపంలోని కల్కుంటి గ్రామ వద్ద జాతీయ రహదారిలో రెండు లారీలు ముఖాముఖీ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. చిత్రదుర్గ జిల్లా నుంచి దావణగెరె వైపు వెళుతున్న లారీ డ్రైవర్‌ అదుపు తప్పి డివైడర్‌ను దాటి దావణగెరె నుంచి చిత్రదుర్గ వైపునకు వస్తున్న లారీని ఢీకొనడంతో రెండు లారీల్లో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను మహాంతేష్‌(35), ఇనాయత్‌ సింగ్‌(30)గా గుర్తించారు. మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స చోసం చిత్రదుర్గ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తెలిసిన వెంటనే భరమసాగర పోలీసులు హుటాహుటిన చేరుకుని కేసు నమోదు చేసుకుని వివరాలు సేకరించారు.

పిడుగుపాటుకు ఎద్దు మృతి

బొప్పాయి పంట ధ్వంసం

హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగిలో మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి పిడుగుపాటుకు ఒక ఎద్దుతో పాటు బొప్పాయి తోట దెబ్బ తింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం రావడంతో పాటు కూడ్లిగితో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా అనేక చోట్ల రైతుల పంటలు దెబ్బతిన్నాయి. అమరదేవరగుడ్డ, గొల్లరహట్టి, బణవికల్లు ఆగ్రహార గ్రామంతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో రైతులు సాగు చేసిన, చేతికొచ్చిన దశలో ఉన్న పంటలు దెబ్బతిన్నాయి. మొరబనహళ్లికి చెందిన ఈరణ్ణ అనే రైతుకు చెందిన ఎద్దుపై పిడుగుపడి స్థలంలోనే ఎద్దు మరణించింది.

మంత్రి పదవి కోరడంలో తప్పు లేదు

హుబ్లీ: గెలిచిన వారందరూ మంత్రి పదవి పొందడానికి అర్హులే. మంత్రి పదవి ఇవ్వమని కోరడంలో తప్పు లేదని, అయితే పార్టీ ప్రోటోకాల్‌కు స్వస్తి చెప్పి ఏమీ వా్‌య్‌ఖ్యానించరాదని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సంతోష్‌లాడ్‌ సూచించారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేలందరూ మంత్రి గిరీ పొందడానికి అర్హులు. వారు ఒకసారి గెలిచినా, రెండు సార్లు గెలిచినా ఎవరైనా కానీ ఎన్ని సార్లు గెలిచినా వారికి మంత్రి కావాలన్న ఆశ ఉంటుంది. అందుకే వారికి ప్రాధ్యానత ఇవ్వాలని హైకమాండ్‌ దగ్గరకు వెళ్లారన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఇంతకు ముందు కాంగ్రెస్సే లోక్‌సభలో పాస్‌ చేయించింది. రాజ్యసభలో కూడా ప్రయత్నించాం. అయితే రాజ్యసభలో మెజార్టీ లేదు. ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రభుత్వం వచ్చి 12 ఏళ్లు గడిచింది. ఈ విషయమై గత 12 ఏళ్ల నుంచి ఎవరూ మాట్లాడలేదన్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు. అయినా బిల్లుకు మా మద్దతు ఉంది. బిల్లు గురించి గందరగోళం ఉంది. కొత్త జనగణను పరిగణిస్తారో లేదో స్పష్టత లేదు. ఈ విషయంలో సమగ్రంగా చర్చలు జరగాలన్నారు.

పోలిక లేదని సొంత

కొడుకును చంపిన తండ్రి

నదిలోకి తీసుకెళ్లి నీటిలో ముంచిన వైనం

విజయపుర జిల్లాలో వెలుగు చూసిన ఘోరం

సాక్షి,బళ్లారి: విజయపుర జిల్లాలో ఘోర దురంతం చోటు చేసుకుంది. తన పోలిక లేదనే అనుమానంతో సొంత కొడుకును నదిలోకి తీసుకెళ్లి ఓ తండ్రి నీటిలో ముంచి దారుణంగా చంపిన ఘటన జిల్లాలోని నాగఠాణ గ్రామంలో చోటు చేసుకుంది. నాగఠాణకు చెందిన సిద్ధార్థ (6) హత్యకు గురైన చిన్నారి. బాలుడు తండ్రి మల్లికార్జున అరకేరిని పలువురు మీ కుమారుడు సిద్ధార్థ చూడటానికి నీలాగా లేడని ఎద్దేవా చేసేవారు. దీన్ని రోజు వింటున్న మల్లికార్జున అక్కసుతో సొంత బిడ్డను నదిలో ముంచి చంపాడు. మహారాష్ట్రలోని కరాడ్‌ జిల్లా వడోలి వద్ద కృష్ణా నదిలోకి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మార్చి 16న కుమారుడిని సదరు నదిలోకి తీసుకెళ్లి ముంచి చంపి తిరిగి ఊరికి వచ్చిన మల్లికార్జునను కొడుకు గురించి ఆరా తీయగా సింధగి వద్ద స్కూల్‌లో చేర్పించి హాస్టల్‌లో పెట్టానని నాటకమాడాడు. ఇక మే 1న సిద్ధార్థ్‌ పుట్టిన రోజు ఉంది. తీసుకొని రమ్మని తల్లి భాగ్యశ్రీ పట్టుబట్టింది. కొడుకు ఏడి? అని నిలదీయగా నిందితుడు మల్లికార్జున పరారయ్యాడు. దీంతో తల్లి భాగ్యశ్రీ అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కుమారుడిని హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడు తానే హత్య చేసినట్లు అంగీకరించాడని, దీంతో మల్లికార్జునను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement