రాయచూరు రూరల్: అంగన్‌వాడీ కార్యకర్తలకు వేసవి కాలంలో అధికంగా ఎండలుండడంతో నెల రోజులు సెలవులివ్వాలని రాష్ట్ర అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం డిమాండ్ చేసింది. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షురాలు పద్మ మాట్లాడుతూ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సీ్త్ర శిశు సంక్షేమ శాఖలో విధులు నిర్వహిస్తున్న కార్యకర్తలకు సెలవులు కేటాయించి, బీఎల్‌ఓ విధుల నుంచి తొలగించాలన్నారు. జనాభా లెక్కల గణన నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ అధికారికి వినతిపత్రం సమర్పించారు.
స్థానిక సంస్థల
ఎన్నికలు నిర్వహించండి
రాయచూరు రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న జెడ్పీ, టీపీ, జీపీల స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని అంబేడ్కర్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు మహేంద్రకుమార్ మిత్ర డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జెడ్పీ, టీపీ సభ్యుల పదవీ కాలం ముగిసి మూడేళ్లు కావస్తున్నా నేటికీ ఎన్నికలు జరుపకుండా వాయిదా వేయడం తగదన్నారు. జెడ్పీ, టీపీ సభ్యుల ఎన్నికలను పార్టీ పరంగా కాకుండా జీపీ ఎన్నికల మాదిరిగా పార్టీలతో నిమిత్తం లేకుండా ఎన్నికలు త్వరగా నిర్వహించాలని లేని తరుణంలో హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు వేస్తామన్నారు.
అసంఘటిత కార్మికులకు వేతనాలు చెల్లించాలి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. మంగళవారం రాయచూరు తాలూకా పంచాయితీ కార్యాలయం వద్ద సంఘం అధ్యక్షుడు శరణ బసవ మాట్లాడారు. కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న వారిపై చేస్తున్న దౌర్జన్యాలు నశించాలన్నారు. నేడు అన్ని విధాలైన వస్తువుల ధరలు మార్కెట్‌లో అధికం కావడంతో వేతనాలను పెంచాలన్నారు. అసంఘటిత వలయాల్లో విధులు నిర్వహించే కార్మికులకు నెలకు రూ.37 వేల నుంచి రూ.42 వేల వరకు వేతనాలు చెల్లించేలా సర్కార్ ఆదేశించాలని కోరుతూ సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టారు.
తాగునీటి ఎద్దడి రానీయకండి
రాయచూరు రూరల్: వేసవిలో మూడు నెలల పాటు ధార్వాడ జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని ధార్వాడ జిల్లాధికారిణి ఆర్.స్నేహల్ అధిరులకు సూచించారు. జిల్లాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 14 గ్రామాల్లో నీటి సరఫరాలో నెలకొన్న జాప్యాన్ని నివారించాలన్నారు. ధార్వాడ జిల్లాలో 90 గ్రామాలకు తాగునీటి ఎద్దడి ఉన్నట్లు గుర్తించామన్నారు. 185 బోరుబావులను తవ్వించి యజమానుల నుంచి గ్రామాలకు సంబంధిత నీటి సరఫరా చేపట్టాలని, విద్యుత్ కోత, మోటార్ల మరమ్మతు, ఇతరత్ర కారణాలు చెప్పకుండా నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, నీటి కుంటలను నింపాలని పీడీఓలకు ఆదేశాలు జారీ చేయాలని టీపీ అధికారులకు సూచించారు. ధార్వాడ తాలూకాలో 115 గ్రామాలకు గాను 30 గ్రామాలు, హుబ్లీ తాలూకాలో 46కు గాను 19 గ్రామాలు, కలఘటిగి తాలూకాలో 87 గ్రామాల్లో 16 గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా పరిగణించామన్నారు.
గంజాయి సేవిస్తున్న ఐదుగురి అరెస్ట్
రాయచూరు రూరల్: గంజాయిని సేవిస్తున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన ఘటన బెళగావి జిల్లాలో జరిగింది. బెళగావిలో సోమవారం సాయంత్రం హిరే బాగేవాడి పోలీసులు మెరుపు దాడి చేసి అభిషేక్ దౌలత్ పాటిల్, విలాస్ శంకర్ బాళేకుంద్రి, విజయ్ సంజయ్, హర్శ సునీల్ వర్మ, హుసేన్ ఓబన్‌సాబ్ అనే ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ బసవరాజ్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.


