సాక్షి,బళ్లారి: ఆర్టీసీ బస్సును బ్రేకులు లేకుండా నడపడంతో ఒక యువకుడు మృతి చెందడంతో పాటు మరొక యువకుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైనా ఆర్‌టీసీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులతో పాటు పలువురు స్థానిక ప్రముఖ నాయకులు హాజరై ఆందోళన చేపట్టారు. సోమవారం ఆర్‌టీసీ బస్సు ఢీకొని అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని ఉంతకల్లు గ్రామానికి చెందిన రవికిరణ్(18) మృతి చెందగా, ఆకాష్ అనే మరొక విద్యార్థి తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అయితే పాలకులు గాని, అధికారులు గాని మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించక పోగా, తీవ్రంగా గాయపడిన ఆకాష్ వైద్యం గురించి పట్టించుకోకపోవడంతో మాజీ మేయర్ వెంకటరమణ, బీజేపీ నాయకుడు గాదిలింగప్ప తదితరులు పెద్ద ఎత్తున జనంతో చేరి ఆర్‌టీసీ బస్టాండ్ వద్ద ఆందోళన చేపట్టారు.
బ్రేకులు లేకుండా బస్సు నడపడంపై ఆగ్రహం
బ్రేకులు లేకుండా బస్సును ఎందుకు నడిపారని మండిపడ్డారు. అమాయకుడైన విద్యార్థి ప్రాణాలు పోయాయని, ఇందుకు ఎవరు బాధ్యులని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని కనీసం పరామర్శించిన వారు లేరన్నారు. గాయపడిన విద్యార్థి వైద్యానికి ఖర్చులు ఎవరు ఇస్తారని ప్రశ్నించారు. బస్టాండు వద్ద బస్సుల రాకపోకలను ఆపేశారు. రెండు గంటల పాటు బస్సుల రాకపోకలను నిలిపివేసి ఆందోళన చేశారు. దీంతో ఆర్‌టీసీ ఉన్నతాధికారులు ఆందోళనకారులతో చర్చించారు. బాధిత కుటుంబానికి పరిహారం అందిస్తామని, గాయపడిన ఆకాష్‌కు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. రామాంజినేయులు, ఉమెన్ రైట్స్ యశోదమ్మ తదితరులు పాల్గొన్నారు.
రెండు గంటల పాటు ధర్నా
బస్సుల రాకపోకలను అడ్డుకొని
నిలిపేసిన వైనం
బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఒత్తిడి
ఎట్టకేలకు దిగొచ్చిన అధికారులు


