మే నెలాఖరులోపు అన్ని గేట్లను ఏర్పాటు చేస్తాం | - | Sakshi
Sakshi News home page

మే నెలాఖరులోపు అన్ని గేట్లను ఏర్పాటు చేస్తాం

Apr 15 2026 7:56 AM | Updated on Apr 15 2026 7:56 AM

సాక్షి,బళ్లారి: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు తాగు, సాగునీరు అందించే ప్రధాన జలాశయం తుంగభద్ర డ్యాంకు మే నెలాఖరులోపు అన్ని కొత్త గేట్లను ఏర్పాటు చేస్తామని తుంగభద్ర బోర్డు ఎస్‌ఈ నారాయణ నాయక్‌ పేర్కొన్నారు. ఆయన మంగళవారం రిటైర్డ్‌ సీనియర్‌ ఇంజనీర్‌, నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రధానంగా గేట్లు ఏర్పాటు, మరమ్మతులు చేయడంలో దిట్టగా ఖ్యాతి పొందిన కన్నయ్యనాయుడుతో కలిసి తుంగభద్ర గేట్ల ఏర్పాటు పనులను పరిశీలించారు. గేట్లు ఏర్పాటుకు సంబంధించి ఆయన సలహాలు, సూచనలను చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డ్యాంకు ఉన్న 33 గేట్లలో అన్ని గేట్లను మారుస్తున్నామన్నారు. ప్రస్తుతం 23 గేట్లు అమర్చే కార్యక్రమం పూర్తియిందన్నారు. మరో మూడు గేట్ల పనులు ప్రగతిలో ఉన్నాయన్నారు. మొత్తం మీద మే నెలాఖరులోపు కచ్చితంగా అన్ని గేట్లను అమర్చేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి రోజు గేట్లు అమర్చే ప్రక్రియను ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా పనులు వేగవంతంగా చేయడంతో 23 గేట్ల పనులు ఇప్పటికే పూర్తి చేశామన్నారు. మరో 10 గేట్లను అమర్చేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో డ్యాం నుంచి కాలువలకు నీరు విడుదల చేసే లోపు పనులు పూర్తి చేయడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. బోర్డు కార్యదర్శి ఓఆర్‌కే రెడ్డి, డ్యాం ఇంజనీర్లు, ఎస్‌డీఓలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

ఖరీఫ్‌లో ఆయకట్టు కాలువలకు

నీటి విడుదలకు ఢోకా లేదు

తుంగభద్ర బోర్డు ఎస్‌ఈ నారాయణ నాయక్‌ వెల్లడి

Advertisement
 
Advertisement
Advertisement