మండ్య: తాలూకాలోని కాచేనహళ్లి సమీపంలో ఆదివారం రాత్రి చామరాజనగర– జీవర్గి హైవేలో కేఎస్ ఆర్టీసీ బస్సును గూడ్స్ వ్యాన్ ఢీకొట్టింది. గూడ్స్ వ్యాన్‌లోని పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కూలీలు సుజమ్రామ్ (27), సుజన్ బర్బన్ (32) మరణించగా, డ్రైవర్ రమేష్ గాయపడ్డాడు. చన్నరాయపట్న తాలూకాలోని నుగ్గేహళ్లిలో ఒక శుద్ధ జల ప్లాంటులో మృతులు కూలీలుగా పనిచేసేవారు. నీటి బాటిళ్లను తీసుకుని వ్యాన్‌లో నాగమంగళ పట్టణానికి వస్తుండగా బస్సును ఢీకొన్నారు. బస్సులోని కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. నాగమంగళ సీఐ శివకుమార్ నేతృత్వంలోని పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఎస్పీ వి.జె.శోభరాణి, ఏఎస్పీ తిమ్మయ్య ఘటనాస్థలిని పరిశీలించారు.
అబ్బే.. నన్ను వేధించలేదు
దొడ్డబళ్లాపురం: బాగలకోటలోని జయమృత్యుంజయ స్వామిపై నమోదైన లైంగిక వేధింపుల కేసు పెట్టిన బాధిత మహిళ మాట మార్చింది. తనపై ఎలాంటి లైంగికదాడి జరగలేదని వీడియో ప్రకటనను విడుదల చేసింది. తాను స్వామిజీపై ఫిర్యాదు చేయలేదని, తనపేరు వాడుకుని కొందరు కేసు పెట్టారని పేర్కొంది. తాను స్వామిజీ వద్ద డబ్బులు డిమాండు చేయలేదంది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నానని, కోలుకున్నాక మీడియా ముందుకు వచ్చి అన్ని వివరాలు చెబుతానని తెలిపింది.
మూడో పెళ్లికి
కేటుగాని యత్నం
బొమ్మనహళ్లి: ఒకరు కాదు, ఇద్దరు భార్యలు ఉన్నారు, అయినా మరో అమ్మాయితో పెళ్ళికి సిద్ధమైన పోకిరీ ఉదంతమిది. యువతుల జీవితాలతో ఆడుకుంటున్న కేటుగాడు రవిపై జిగణి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రవి పెద్ద ఉద్యోగం చేస్తానని ఆడంబరంగా కనిపించేవాడు. తనకు ఇంకా పెళ్లి కాలేదని అబద్ధాలు చెబుతూ యువతులకు వల వేసేవాడు. మొదటి భార్య ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లినప్పుడు, మరో యువతిని కొన్ని నెలల కిందటే పెళ్లి చేసుకున్నాడు. ఇంతలో మరో యువతిని నిశ్చితార్థం చేసుకున్నాడు. చివరకు విషయం తెలిసి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది తెలిసి నిందితుడు రవి పరారీలో ఉన్నాడు.
ఎంతో జీవితం..
క్షణాల్లో అంతం
● యువ టెక్కీ దుర్మరణం
యశవంతపుర: రోడ్డు ప్రమాదంలో యువ టెక్కీ దుర్మరణం చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో జరిగింది. దక్షిణ కన్నడ జిల్లా సుళ్యకు చెందిన టెక్కీ క్షిప్రా (27) మృతి చెందింది. మంగళూరుకు చెందిన శశి కళాభట్‌కు ఏకై క కూతురు క్షిప్రా. బెంగళూరులో ప్రైవేట్ కంపెనీలో టెక్కీగా పని చేస్తోంది. రాయచూరు జిల్లాలో స్నేహితురాలి పెళ్లి ఉండడంతో సహ ఉద్యోగులతో కలిసి ఆనందంగా కారులో కర్నూలు పర్యటనకు వెళ్లారు. ఆదోని పట్టణం వద్ద కారు డ్రైవర్‌కు నిద్ర మత్తు వచ్చి చెట్టును ఢీన్నాడు. ఈ ప్రమాదంలో క్షిప్రాకు బలమైన గాయాలై అక్కడే చనిపోయింది. మరో యువకుడు, ఇద్దరు యువతులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రిలో చేర్చి చికిత్సలు అందిస్తున్నారు. క్షిప్రా ఎంటెక్ చేసింది, కొన్నేళ్ల కిందట తండ్రి చనిపోగా, ఆమెను తల్లి కంటికి రెప్పలా చూసుకుంటోంది. తల్లీ కూతురు బెంగళూరులోనే నివసిస్తున్నారు. ఇంతలో ఏకై క ఆధారంగా ఉన్న కూతురు కూడా మరణించడంతో తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. బంధువులు మృతదేహాన్ని సొంతూరికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు.
ఇద్దరు ఆర్టీఓ అధికారుల అరెస్టు
దొడ్డబళ్లాపురం: వాహనాల డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు ఆర్టీఓ అధికారులను లోకాయుక్త పోలీసులు అరెస్టు చేశారు. నెలమంగల ఆర్టీఓ ఇన్స్‌పెక్టర్‌లు దినేశ్, కిరణ్ పట్టుబడ్డారు. ఇద్దరూ నిత్యం తనిఖీలు చేసే సాకుతో వాహనాలు నిలిపి డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందడంతో బెంగళూరు గ్రామీణ జిల్లా లోకాయుక్త ఎస్పీ కోన వంశీకృష్ణ ఆధ్వర్యంలో దాడులు చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని విచారణకు తరలించారు.


