మండ్య: జిల్లాలోని నాగమంగళ వద్దనున్న ఆది చుంచనగిరి మఠంలో నిర్మించిన శ్రీ గురు భైరవైక్య ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 15వ తేదీన ప్రారంభించనున్నారు. ఇందుకోసం భారీఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘ఇది ఒక సజీవ ఆధ్యాత్మిక నిలయం. ద్రావిడ వాస్తుశైలిలో నిర్మాణమైంది’ అని మఠాధిపతి నిర్మలానందనాధ స్వామి సోమవారం తెలిపారు. ఒడిశాలోని సూర్య దేవాలయం కళను మేళవించి, రూ.100 కోట్లకు పైగా వ్యయంతో ఈ ఆలయాన్ని సుందరంగా నిర్మించినట్లు తెలిపారు. ఇందులో హొయసళ, చోళ, చాళుక్య, గంగా వాస్తుశైలుల సమ్మేళనం కనిపిస్తుందని చెప్పారు. ద్రావిడ వాస్తుశైలి ఆకాశాన్ని తాకే గోపురాలు, అద్భుతమైన శిల్పాలు, విశ్వ నియమాలకు అనుగుణంగా ఉండే రూపకల్పన అని పేర్కొన్నారు.
3 రకాల శిలలతో నిర్మాణం
భైరవైక్య ఆలయ నిర్మాణంలో మూడు రకాల రాళ్లను ఉపయోగించారు. క్లియోరా అనే రాయికి పెద్దపీట వేశారు. ఆలయానికి ఇలకల్ రకం రాయిని, కింది భాగానికి సంతేకల్ రకం రాయిని ఉపయోగించారు. లోపల మొత్తం క్లియోరా శిలలతో తీర్చిదిద్దారు. ప్రధానికి నెమలి ప్రతిమను అందజేస్తామని స్వామీజీ చెప్పారు. తమిళనాడుకు చెందిన శంకర్ స్థపతి ఈ ఆలయాన్ని నిర్మించారు. బెంగళూరులోని వికాససౌధ, ఉద్యోగ సౌధ, బెళగావిలోని సువర్ణ సౌధలను నిర్మించింది కూడా శంకరేనని స్వామీజీ తెలిపారు.
ప్రధాని పర్యటన ఇలా..
ప్రధాని మోదీ బెంగళూరులోని హెచ్‌ఏఎల్ విమానాశ్రయంలో ప్రత్యేక విమానంలో దిగి, హెలికాప్టర్‌లో ఆది చుంచనగిరి క్షేత్రానికి చేరుకుంటారు. కాలభైరవేశ్వర ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటారు. తరువాత భైరవైక్య ఆలయాన్ని అంకితం చేస్తారు. ఆదిచుంచనగిరి క్షేత్ర స్టేడియంలో జరిగే సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
రేపు ఆది చుంచనగిరి మఠంలో
భైరవైక్య ఆలయం ప్రారంభం
కాల భైరవుని ఆలయంలో విశేష పూజలు


