వరుస ప్రమాదాలు.. నెత్తురోడిన రోడు్ల | - | Sakshi
Sakshi News home page

వరుస ప్రమాదాలు.. నెత్తురోడిన రోడు్ల

Apr 14 2026 7:52 AM | Updated on Apr 14 2026 7:52 AM

సాక్షి,బళ్లారి: నగరంలో వేర్వేరు రోడ్లలో ప్రమాదాలు జరిగి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. సోమవారం నగరంలోని జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరం సమీపంలో బ్రేకులు లేని ఎన్‌ఈకేఆర్‌టీసీ బస్సు ఢీకొని ఓ యువకుడు మృతి చెందారు. రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్‌ మండలం ఉంతకల్లు గ్రామానికి చెందిన వెంకటేశులు, శ్రీదేవి దంపతుల కుమారుడు రవికిరణ్‌ (18) బళ్లారిలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో డిప్లొమా ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం తన స్నేహితుడిని కలిసేందుకు ఉంతకల్లు నుంచి ఏథర్‌ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనం(కే.ఎ.34 ఈడబ్ల్యూ– 6076)లో బళ్లారికి వెళ్లాడు. అనంతరం స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై రంగమందిరం నుంచి బస్టాండు వైపునకు వెళుతుండగా మోతీ సర్కిల్‌ వద్దకు చేరుకోగానే బళ్లారి నుంచి కూరిగనూరుకు వెళుతున్న కేఏ–34 ఎఫ్‌–1211 నంబరుగల ఆర్టీసీ బస్సు బ్రేక్‌లు పడకపోవడంతో అదుపు తప్పి ద్విచక్ర వాహనంపైకి దూసుకెళ్లి వెనుక నుంచి ఢీకొంది. ఘటనలో రవికిరణ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన స్నేహితుడిని స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తెలిసిన వెంటనే ట్రాఫిక్‌ పోలీసులు హుటాహుటిన చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు.

ప్రమాదంతో ట్రాఫిక్‌కు అంతరాయం

ప్రధాన కూడలిలో రోడ్డు ప్రమాదం జరగడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి పూర్తిగా స్తంభించింది. యువకుడిని ఆంధ్రప్రదేశ్‌కు చెందినవాడుగా గుర్తించారు. బస్సుకు బ్రేకులు సరిగా పడటం లేదని బస్సు డ్రైవర్‌ వీరనగౌడ పేర్కొనడం గమనార్హం. ఇదే విషయంపై అధికారులకు కూడా తెలిపామన్నారు. బ్రేకులు లేకుండా బస్సును పంపడం వల్లే ప్రమాదం జరిగిందనే విషయం కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. మృతుడి కుటుంబానికి ఎన్‌ఈకేఆర్‌టీసీ సంస్థ పెద్ద ఎత్తున పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. ఘటనతో మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

సంగం సర్కిల్‌లో మరో ప్రమాదం

కాగా నగరంలో సంగం సర్కిల్‌ వద్ద జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. సండూరు తాలూకా కుడితినికి చెందిన పరుశురాం(32) అనే వ్యక్తి బళ్లారికి వచ్చి రోడ్డు మీద పక్కన నడుచుకుంటూ వెళుతుండగా, ఎదురుగా వస్తున్న మినీ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కూలి పనులు చేసుకుని జీవనం సాగించేవాడని, ఇద్దరు సంతానం ఉన్నారని, రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యంతో మృతి చెందాడా? లేక వ్యక్తి అజాగ్రత్తగా నడుచుకుంటూ వస్తూ లారీ కింద పడ్డారా అనే కోణంలో ట్రాఫిక్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకే రోజు నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందడంపై నగర వాసులు ఆందోళన వ్యక్తం చేశారు.

నగరంలో వేర్వేరు రోడ్లలో ప్రమాదాలు, ఇద్దరు దుర్మరణం

బ్రేకు ఫెయిలై ఆర్‌టీసీ బస్సు ఢీకొని యువకుడు బలి

మిని లారీ ఢీకొని కుడితినికి చెందిన వ్యక్తి కూడా మృతి

ప్రమాదాలతో రక్తసిక్తంగా మారిన బళ్లారి నగర రోడ్లు

Advertisement
 
Advertisement
Advertisement