హుబ్లీ: కాంగ్రెస్ యువనేత ఫైరోజ్ పఠాన్ హత్యకు వ్యక్తిగత ద్వేషాలే కారణమని తేలడంతో ఈ కేసులో 9 మందిని అరెస్ట్ చేశామని హుబ్లీ ధార్వాడ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ నిందితులందరినీ జుడీషియల్ కస్టడీకి అప్పగించామని, అదనపు విచారణ కోసం పోలీస్ కస్టడీకి అనుమతి తీసుకున్నామన్నారు. హత్యకు వాడిన రెండు బైకులతో పాటు ఓ కారును స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసులో మహమ్మద్ షా, సయ్యద్ గౌస్, పర్వేజ్, సమీర్, సద్దాం హుస్సేన్, కై ఫ్, అర్బాజ్, సోహిల్ ఖాన్, మక్తుంలను అరెస్ట్ చేశామన్నారు. వీరిలో మహమ్మద్ షా, ఫైరోజ్ పఠాన్ మధ్య వ్యక్తిగత కక్షలు, పగలు రగిలాయన్నారు. హత్యకు గురైన ఫైరోజ్ తనను చాలా వేధించేవాడని, ఎన్నో సార్లు వ్యక్తిగతంగా గొడవ పడి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడన్నారు. ఈ కారణంగానే పఠాన్‌ను హత్య చేసినట్లు మహమ్మద్ షా విచారణలో తెలిపాడన్నారు. నిందితుల్లో కొందరికి నేర నేపథ్యం ఉందన్నారు. పథకం ప్రకారమే చాలా రోజులుగా కాపు గాసి ఈ హత్యకు పథకం రూపొందించారన్నారు. ముఖ్యంగా ఆరోజు రాత్రి మగవాళ్లు లేని సమయం చూసి హత్య చేశారు. కాగా ఈ నెల 24న పఠాన్‌కు పెళ్లి జరగాల్సి ఉండిందన్నారు.
ఎమ్మెల్సీ రాజీనామా చేయరాదని ధర్నా
కేజీఎఫ్ : విధాన పరిషత్ సభ్యుడు నజీర్ అహ్మద్ తన పదవికి రాజీనామా చేయరాదని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ మైనారిటీ నాయకులు సోమవారం నగరంలోని గాంధీ సర్కిల్ వద్ద ధర్నా చేశారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాణిక్యం మాట్లాడుతూ ఎమ్మెల్సీ నజీర్ అహ్మద్ విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్నో సేవలు అందించారన్నారు. ఆయన ఎన్నడూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదన్నారు. అయితే దావణగెరె ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి రాలేదనే నెపంతో పార్టీ హైకమాండ్ రాజీనామా చేయాలని అడుగుతుండడం దురదృష్టకరమన్నారు. నజీర్ అహ్మద్ పార్టీకి ఎనలేని సేవలు అందించారన్నారు. దావణగెరె దక్షిణ కాంగ్రెస్ అభ్యర్థి తరపున ఆయన ముమ్మరంగా ప్రచారం సాగించారన్నారు. పార్టీ హైకమాండ్ కొంతమంది చెప్పుడు మాటలు విని అకారణంగా ఆయనను రాజీనామా చేయాలని కోరుతుండడం సరికాదని అన్నారు. నజీర్ అహ్మద్ తన పదవికి రాజీనామా చేస్తే తాము కేజీఎఫ్‌ను బంద్ చేసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితిలోను నజీర్ అహ్మద్ తన పదవికి రాజీనామా చేయకూడదన్నారు. ధర్నాలో నగరసభ స్థాయి సమితి అధ్యక్షుడు అమీర్, నగరాభివృద్ధి ప్రాధికార అధ్యక్షుడు జయపాల్, శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు.
చెరువులో మునిగి
ఇద్దరు మహిళల మృతి
కోలారు : చెరువులో మునిగి ఇద్దరు మహిళలు మృతి చెందిన ఘటన నగర సమీపంలోని అరహళ్లి చెరువులో ఆదివారం చోటు చేసుకుంది. నగరంలోని నిసార్ నగర్‌కు చెందిన మహ్మది(25), బెంగళూరుకు చెందిన సల్మా (26) చెరువులో మునిగి మృతి చెందిన మహిళలు. ఇంట్లో కార్యక్రమం కోసం బెంగళూరు నుంచి వచ్చిన సల్మా, మహ్మది బట్టలు ఉతకడానికి చెరువు వద్దకు వెళ్లారు. నీటిలో పడిన తమ దుస్తులను తీసుకోడానికి ప్రయత్నించి తాము చెరువులో మునిగి మరణించారు. ఘటనా స్థలానికి కోలారు రూరల్ పోలీసులు వెళ్లి పరిశీలన జరిపారు. మృతదేహాలను పోస్టుమార్టం చేసిన తర్వాత సంబంధీకులకు అప్పగించారు.
మహిళ కన్నుమూత
మండ్య: మండ్య జిల్లాలోని పాండవపుర తాలూకాలోని చినకుర్లి ప్రభుత్వ ప్రీ–యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్, నాల్వాడి లయన్స్ క్లబ్ సభ్యులు బి.లింగేగౌడ భార్య త్రిగుణ (48), అనారోగ్యంతో ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఎమ్మెల్సీ మధు మాదేగౌడ, కె. వివేకానంద, మరితిబ్బెగౌడ, డా. హెచ్.ఎస్.ముద్దేగౌడ, విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ సి. చెలువయ్య తదితరులు మృతదేహానికి నివాళులర్పించారు. మలవళ్లి తాలూకాలోని దాసనదొడ్డి గ్రామంలో అంత్యక్రియలు జరిపారు.


