బొమ్మనహళ్లి: బెంగళూరు శివారులోని ఆనేకల్ సబ్–డివిజన్ జిగని పోలీసులు ఇద్దరు దోపిడీ దొంగలను అరెస్టు చేయడంలో సఫలమయ్యారు. వీరిద్దరి గతాన్ని తలచుకుంటేనే భయం వేస్తుంది. ఇందులో ఒకడు దోపిడీలకు పాల్పడే ఒంటి కాలు దొంగ.. మరొకడు ఏకంగా ఎమ్మెల్యే కారుకు నిప్పు పెట్టిన దొంగ. వీళ్లిద్దరూ అవకాశం దొరికిన ప్రతిచోటా దోపిడీలకు పాల్పడ్డారు. కృష్ణనాయక్ అలియాస్ కుంటి కృష్ణ. ఇతడిని హవళి కృష్ణ అని కూడా పిలుస్తారు. మరొకడు నవీన్ అలియాస్ కల్లప్ప. ఇంకో పేరు రాబరీ కాలా. కృష్ణ నాయక్ ఆటో నడిపేవాడు. చిన్న వయసులోనే దొంగతనాలు, దోపిడీలకు అలవాటు పడ్డాడు. ఆటోలో జనాలను కిడ్నాప్ చేసి దోచుకునే వాడు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు ఒకసారి ఇతడిపై కాల్పులు జరపడంతో ఒక కాలు కోల్పోయాడు. జైలుకు వెళ్లొచ్చిన తర్వాత కూడా ఒకే కాలుతో ఆటో నడుపుతాడు. అనుచరులతో కలిసి అమాయకులను కిడ్నాప్ చేసి, డబ్బు దోచుకుంటాడు. వారిపై దాడి చేసి పారిపోతాడు. ఇప్పటి వరకు అతడిపై 20కి పైగా కేసులు ఉన్నాయి. బన్నేరుఘట్ట, సూర్యనగర్, హెబ్బగోడి, జిగణితో సహా అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
ఎమ్మెల్యే కారుకు నిప్పు పెట్టిన ఘనుడు
2021లో బొమ్మనహళ్లి ఎమ్మెల్యే ఎం.సతీష్ రెడ్డి కారుకు మరో దొంగ నవీన్ అలియాస్ రాబరీ కాలా నిప్పు పెట్టాడు. ఇంటి దగ్గర పార్క్ చేసిన రెండు కార్లు కాలిపోయాయి. ఆ కేసులో అతను ప్రధాన నిందితుడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత.. మళ్లీ దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. బైక్‌లతో సహా ప్రజలను దోచుకునే వాడు. హవళీ కృష్ణతో చేరిన కల్లప్ప.. అవకాశం దొరికిన చోటల్లా ప్రజలను దోచుకున్నారు.
చిత్రహింసలు పెట్టడంలో దిట్టలు..
ఈ ఇద్దరు పేరు మోసిన దొంగలు ఇటీవల యరందహళ్లి సమీపంలో దోపిడీకి పాల్పడ్డారు. సుందర్ రాజ్‌ను హవళీ కృష్ణ ఆటోలోకి బలవంతంగా ఎక్కించి డబ్బు, మొబైల్ ఫోన్ లాక్కున్నారు. ఆ తర్వాత అతడి ఏటీఎం కార్డు ఇవ్వమని డిమాండ్ చేశారు. అతను నిరాకరించడంతో చెవి కోసి చిత్రహింసలు పెట్టారు. అనంతరం ఏటీఎం కార్డును లాక్కొని రూ.లక్ష విత్‌డ్రా చేశారు. అనంతరం సుందర్ రాజ్‌ను నిర్మానుష్య ప్రదేశంలో వదిలి పారిపోయారు. కేసు నమోదు చేసిన జిగణి పోలీసులు, ఇన్‌స్పెక్టర్ మంజునాథ్ నేతృత్వంలో ఒక బందాన్ని ఏర్పాటు చేశారు. నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించారు.


