ప్రియుడి స్వార్థానికి యువతి | - | Sakshi
Sakshi News home page

ప్రియుడి స్వార్థానికి యువతి

Apr 14 2026 7:52 AM | Updated on Apr 14 2026 7:52 AM

హుబ్లీ/రాయచూరు రూరల్‌: తాను ప్రేమించిన యువతికి వేరొకరితో పెళ్లి ఖాయం అయిన విషయం జీర్ణించుకోలేని స్వార్థ ప్రేమికుడు ఆ యువతితో తాను తీసుకున్న ఫోటోలను నిశ్చితార్థం జరిగిన యువకుడి కుటుంబ సభ్యులకు పంపాడు. ఫలితంగా పెళ్లి రద్దు కావడంతో మనోవేదనకు గురై ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయపుర జిల్లాలో చోటు చేసుకుంది. ఈ విషాద ఘటన వివరాలు.. విజయపుర జిల్లా సింధగి తాలూకా బంధాల గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతి జయశ్రీ బిరాదార్‌కు పెళ్లి చేయడానికి వరుడిని నిశ్చయించి సంబంధిత కార్యాన్ని నెరవేర్చారు. అయితే జయశ్రీ ఇంతకు ముందు శ్రీశైల బడనూరును ప్రేమించింది. తనను కాదని వేరే వ్యక్తితో వివాహం ఖరారు చేసుకోవడాన్ని శ్రీశైల జీర్ణించుకోలేక పోయాడు.

తనతో ఆమె ఉన్న ఫొటోలు షేర్‌

ఆ యువతి తనతో ఉన్న ఫోటోలను వరుడి కుటుంబ సభ్యులకు షేర్‌ చేశాడు. వాటిని చూసిన వరుడి కుటుంబ సభ్యులు గత నెల 27న నిశ్చయించుకున్న పెళ్లిని రద్దు చేసుకున్నారు. పెళ్లి రద్దు కావడంతో తీవ్ర మనోవేదనకు గురై జయశ్రీ జీవితంపై విరక్తి చెంది బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ గ్రామంలోని మదీనా మసీదు పక్కన ఉన్న బావిలోకి దూకిన జయశ్రీ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. సింధగి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. విరిసీ విరియని ప్రేమ త్యాగానికి బదులుగా ప్రాణాలను బలి కోరుకోవడం నేటి విచిత్రం. ముక్కుపచ్చలారని తమ కుమార్తె పిచ్చి ప్రేమికుడు శ్రీశైల స్వార్థానికి బలి కావడంపై యువతి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. నిందితుడిపై కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement