లంచాల కోసం పోలీసులపై ఎస్‌ఐ ఒత్తిడి | - | Sakshi
Sakshi News home page

లంచాల కోసం పోలీసులపై ఎస్‌ఐ ఒత్తిడి

Apr 14 2026 7:52 AM | Updated on Apr 14 2026 7:52 AM

సాక్షి,బళ్లారి: ఆయనో పోలీసు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌. ఆయన గుట్టుచప్పుడు కాకుండా పెద్ద ఎత్తున లంచం తీసుకోవడమే కాకుండా, కింది స్థాయి సిబ్బంది, పోలీసులను నగరంలో అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున లంచాలు తేవాలని ఒత్తిడి చేయడం కలకలం సృష్టించింది. నిత్యం ఎస్‌ఐ వేధింపులు తాళలేక పోలీసులు ఏకంగా ముఖ్యమంత్రికి, హోంమంత్రికి లేఖలు రాశారు. వివరాల్లోకి వెళితే.. విజయపుర నగరంలోని ఆదర్శ నగర్‌ పోలీసు స్టేషన్‌లో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న లమాణి అనే వ్యక్తి అవినీతి పేట్రేగిపోవడంతో పోలీసులు భరించలేక పోయారు. పోలీసు స్టేషన్‌కు వచ్చి కేసులు పెట్టే వారి నుంచే కాకుండా ఇతరుల నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

భారీగా లంచాల వసూలుకు సూచన

నగరంలో మట్కా, గ్యాంబ్లింగ్‌, పేకాట, వేశ్యావాటికలు, బార్లు, స్పాలు తదితర అసాంఘీక కార్యకలాపాలు నడిపే వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి తేవాలని సూచించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నెల నెలా లంచం తేవాలని, లేకపోతే కేసులు పెట్టాలని సూచించడంతో ఎస్‌ఐ వేధింపులు తట్టుకోలేక సీఎంకు, హోంమంత్రికి లేఖ రాశారు. ఎస్‌ఐ ఆదేశాలను తాము పాటించలేమని, పని చేయడం చాలా కష్టంగా ఉందని, తమ గౌరవం, నిజాయితీ కాపాడుకోడానికి వేరే మార్గం లేక సామూహికంగా విధులను సైతం వదిలిపెట్టేందుకు వెనుకాడబోమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన విజయపుర జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తక్షణం ఎస్‌ఐని సస్పెండ్‌ చేయాలని లేదా వేరే చోటకు బదిలీ చేయాలని స్థానికులు కోరారు.

వేధింపులు తాళలేక సీఎంకు, హోంమంత్రికి లేఖ

Advertisement
 
Advertisement
Advertisement