రాయచూరు రూరల్: కర్ణాటకలో పశుగ్రాసం కొరత వేధిస్తోంది. పాడిపోషణ రైతులు పుశుగ్రాసం సమస్యతో అల్లాడిపోతున్నారు. అధిక ధరలు చెల్లించి ఇతర ప్రాంతాల నుంచి పశుగ్రాసం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఖరీఫ్ ప్రారంభంలోనే ఇలా ఉంటే మూగ జీవాలను ఎలా కాపాడుకోవాలి అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కల్యాణ కర్నాటకలోని ఆరు జిల్లాలో కరువు సంభవించినా కేంద్ర, రాష్ట్ర సర్కార్లు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. సమయానికి వర్షాలు కురవక పోవడంతో చెరువులు, కుంటలు, బావులు, వాగులు నీరు లేక వెలవెలబోతున్నాయి. పంటలు పండక పోవడంతో పశువులకు పశుగ్రాసం అందని దుస్థితి నెలకొంది. పట్టణ ప్రాంతాల్లో పఽశువులకు పశుగ్రాసం లభించకపోవడంతో ప్లాస్టిక్ పేపర్లు, సంచులు తింటూ మృత్యువాత పడుతున్నాయి. హైదరాబాద్ కర్ణాటకలోని రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను ఆలకించే దండనాయకులు (తహసీల్దార్) మాయం అవుతున్నారు. రైతన్నల గోడు పట్టించుకునే వారు కరువయ్యారు. పంటలు నష్టపోయి రైతన్నలు ఇబ్బందులు పడుతున్నా.. పంట నష్ట పరిహారం అందించేందుకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరిగినా తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశుగ్రాసం కొరతతో రైతులు చేసేది ఏమీ లేక దిక్కుతోచని పరిస్థితిలో పశువులను కబేళాకు తరలిస్తున్నారు. జిల్లాలో 1.55 లక్షలకు పైగా పశువులను విక్రయించినట్లు సమాచారం. జిల్లాలో 4.67 లక్షల క్వింటాళ్ల పశుగ్రాసం అవసరముందని పశు సంవర్దక శాఖ అధికారులు జిల్లా అధికారికి రెండు నెలల క్రితం ప్రతిపాదనలను పంపినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 12 వేల మంది రైతులకు మినీకిట్లను పంపిణీ చేస్తామన్న అధికారులు.. కేవలం 3,262 మంది రైతులకు పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు.
వర్షాభావంతో పండని పంటలు
వేధిస్తున్న పశుగ్రాసం సమస్య
కబేళాకు తరలుతున్న పశువులు
పట్టణాల్లో పశువులకు మేతగా
మారిన ప్లాస్టిక్


