సాక్షి బళ్లారి: ప్రతి విద్యార్థికి చదువుకునే రోజులు, విద్యార్థి దశ మరుపురానివి. సమయాన్ని వృథా చేయకుండా క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని మాజీ ఎమ్మెల్యే గాలిసోమశేఖర్ రెడ్డి సూచించారు. నగరంలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, కర్ణాటక జిల్లా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలబుర్గి విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందిన డాక్టర్ పీజీఆర్ సింధ్యను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింధ్య విద్యా ప్రస్తానం, సమాజ సేవ, స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యకలాపాలు, సేవా కార్యక్రమాల్లొ పాల్గొనడం హర్షణీయమన్నారు. విద్యా రంగంలో అనేక విజయాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచారని తెలిపారు. నేటి విద్యార్థులు, యువత సెల్‌ఫోన్లు వాడుతూ సమయాన్ని వృథా చేసుకుంటున్నారని పేర్కొన్నారు. తమ లక్ష్యానికి చేరుకోకుండా సమస్యల్లో చిక్కుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతికత, సెల్‌ఫోన్లను సరైనా మార్గంలో ఉపయోగించుకుని ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాక్షించారు.
సంఘాన్ని
బలోపేతం చేయాలి
రాయచూరు రూరల్: వ్యాయామ ఉపాధ్యాయలు ఐకమత్యంగా ఉంటూ సంఘాన్ని బలోపేతం చేయాలని తాలుకా విద్యాశాఖ అధికారి ఈరన్న పిలుపునిచ్చారు. ఆదివారం ఎన్‌జీఓ కార్యాలయంలో వ్యాయామ ఉపాధ్యాయుల జిల్లా, తాలుకా స్థాయి పదాధికారుల పద గ్రహణం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు యంకప్ప, రంగస్వామి, రాజశ్రీ , బాలప్ప, రవీంద్ర, రాజు, కృష్ణ, రమేష్, సుచిత్, హనుమంతరాయ, ప్రకాష్, జయలక్ష్మి, రవి, కవిత, వెంకటేష్, శకుంతల, పరిమళ, శంకరప్ప తదితరులు పాల్గొన్నారు.
మహిళా రచయితలను గుర్తించాలి
హొసపేటె: సమాజం మహిళలను మాతృ ప్రేమతో గౌరవిస్తుంది. ఇది కేవలం మాతృత్వానికే పరిమితం అయితే మహిళలు అంతకుమించి ఎంతో కృషి చేశారు. మనం దానిని కూడా గుర్తించాలని కర్ణాటక మహిళ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్.సునందమ్మ తెలిపారు. హంపీ కన్నడ విశ్వవిద్యాలయ సమాచార కేంద్రం విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ టి.మీనాక్షి రచించిన అభినందన పుస్తకాన్ని శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అనేక సందర్భాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ విజయాలు సాధించారన్నారు. అయినప్పటికీ వారిని ఒక పరిమితం అయిన విధానంలో గుర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పురుషాదిక్య వ్యవస్థలో మహిళ విజయాలు మరుగున పడుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ వీరేష్ బడిగేర్, రచయిత ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.
ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి
హొసపేటె: ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి అని ఎస్పీ జాహ్నవి తెలిపారు. శనివారం హొసపేటె నగరంలోని వివిధ కూడళ్లలో వాహనాల తనిఖీ చేపట్టారు. హెల్మెట్లు ధరించని వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చారు. వారితో అక్కడికక్కడే హెల్మెట్ కొనుగోలు చేయించి, రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు. హెల్మెట్ విషయంపై పోలీస్ శాఖ అవగాహన కల్పించిన తర్వాత జరిమానా విధించాలి. ఇది తెలియకుండా ఏకంగా వాహనాలను అడ్డుకోవడంపై వాహనదారులు శాపనార్థాలు పెడుతున్నారు. ఈ విషయంపై ఎస్పీ జాహ్నవి స్పందిస్తూ.. రోడ్డు భద్రతకు హెల్మెట్ల వాడకం అత్యవసరమన్నారు. ప్రమాదాల్లో ప్రాణ నష్టం నివారించడానికి ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్లు ధరించాలని పేర్కొన్నారు.


