వైభవం.. గుడికట్ల ఉత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవం.. గుడికట్ల ఉత్సవం

Apr 13 2026 7:26 AM | Updated on Apr 13 2026 7:26 AM

విడపనకల్లు: విడపనకల్లులో కురుబల ఆరాధ్య దైవమైన విడపనకల్లప్ప గుడికట్ల ఉత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిపారు. ఉత్సవానికి ముఖ్య అతిథిగా ఉరవకొండ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో కురుబలంతా పాల్గొని విడపనకల్లప్ప, గుడికట్ల పట్టాదేవరలను మేళతాళాలతోను, డప్పులతో ఘనంగా ఊరేగించారు. పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొని పూజలు చేశారు. పార్టీ నేతలు భరత్‌రెడ్డి, సీపీ వీరన్న, యోగేంద్రరెడ్డి, హోతూరు సురేష్‌, పరమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. బళ్లారి తదితర ప్రాంతాల నుంచి జాతరకు బంధువులు తరలి రావడంతో ఇంటింటా సందడి నెలకొంది.

మునియప్పకు

అంబేడ్కర్‌ అవార్డు

కోలారు: అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని సాంఘిక సంక్షేమ శాఖ అందించే డాక్టర్‌ అంబేడ్కర్‌ అవార్డుకు జిల్లాకు చెందిన సీనియర్‌ దళిత నాయకుడు, పాత్రికేయుడు సీఎం మునియప్పను ఎంపిక చేశారు. ఈనెల 14వ తేదీన విధాన సౌధ బాంక్వెట్‌ హాల్‌లో ముఖ్యమంత్రి సిద్దరామయ్య అవార్డుతో పాటు రూ.5 లక్షల నగదు, 20 గ్రాముల బంగారు ప్రశస్తిని అందించనున్నారు. అవార్డుపై స్పందించిన సీఎం మునియప్ప మాట్లాడుతూ.. అవార్డు రావడం సంతోషం కలిగించిందన్నారు. సముదాయం ఎదుగుదల కోసం పోరాటాలు సాగించానని తెలిపారు.

చైన్‌ దొంగిలించిన వ్యక్తి అరెస్ట్‌

శ్రీనివాసపురం: తాలూకాలోని దొడమలదొడ్డి గ్రామంలో మహిళ మెడలోని మాంగల్యం చైన్‌ను దొంగిలించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.5 లక్షలు విలువ చేసే 36 గ్రాముల చైను, కాసు, రెండు గుండ్లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాసపురం తాలూకా మొగిలహళ్లి గ్రామానికి చెందిన ఎం.ప్రేమ కుమార్‌ (21) పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు. దొడమలదొడ్డి గ్రామానికి చెందిన శ్రావణి సాయంత్రం పొలం నుంచి ఇంటి వెళుతున్న సమయంలో మాటు వేసిన ప్రేమకుమార్‌.. శ్రావణి మెడలోని మాంగల్యం గొలుసు లాక్కొని పారిపోయాడు. శ్రావణి శ్రీనివాసపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

36 ఏళ్ల తర్వాత పట్టుబడిన

హత్య కేసు నిందితుడు

కోలారు: హత్య కేసులో నిందితుడిగా ఉన్న శీనప్ప అనే వ్యక్తిని 36 ఏళ్ల తరువాత నంగలి పోలీసులు అరెస్టు చేసి జ్యుడిషియల్‌ కస్టడీకి పంపారు. ముళబాగిలు తాలూకాలోని హుళికుప్ప గ్రామంలో జనవరి 30, 1990వ తేదీన తన కుమారుడు నారాయణప్ప కనిపించడం లేదని తల్లి వెంకటమ్మ నంగలి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఒకరోజు తరువాత వంకలో పూడ్చిన స్థితిలో నారాయణప్ప శవం కనిపించింది. హత్య జరిగినట్లుగా భావించిన నంగలి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. హత్య కేసులో నిందితుడు అయిన శీనప్పకు అప్పుడు 29 సంవత్సరాలు. 36 సంవత్సరాలు గడిచినా నిందితుడి ఆచూకీ తెలియలేదు. నూతన ఎస్పీ కన్నికా సిక్రివాల్‌ పాత కేసులను తిగదోడి మళ్లీ రీ ఓపెన్‌ చేయించారు. నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాన్ని రచించారు. నిందితుడు శీనప్ప కుప్పంలోని ఓ హోటల్‌లో పని చేస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు అరెస్టు చేసి తీసుకొచ్చి జ్యుడిషియల్‌ కస్టడీకి పంపించారు.

కేజీఎఫ్‌లో అవినీతి అక్రమాలు

కేజీఎఫ్‌: నియోజకవర్గ ఎమ్మెల్యే రూపా పిల్లల మనసులలో జాతి విషబీజాలను నాటుతున్నారని బీజేపీ నాయకుడు వళ్లల్‌ మునిస్వామి ఆరోపించారు. ఆదివారం ఇంటర్‌ పరీక్షలో అత్యున్నత మార్కులు సాధించిన అహింద వర్గం పిల్లలను సన్మానించి మాట్లాడారు. కెజీఎఫ్‌ తాలూకాలో 80 శాతం మంది అహింద వర్గం వారు ఉన్నారు. ఎంతో మంది ఇంటర్‌లో ఉత్తమ మార్కులు సాధించారు. అయితే ఎమ్మెల్యే తనకు కావలసిన వారి పిల్లలను మాత్రమే పిలిచి ఇంట్లో సన్మానం చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్యే అన్ని సముదాయాల వారిని సమానంగా చూడాలన్నారు. కేజీఎఫ్‌లో అధికారులు ఓ వ్యక్తి సహకారంతో అవినీతి అక్రమాలు నిర్వహిస్తున్నారని ఇందుకు తన వద్ద దాఖలాలు ఉన్నాయన్నారు. తాగునీటి సమస్య ఉన్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement