రైతుల కష్టం.. హోటళ్లకు లాభం | - | Sakshi
Sakshi News home page

రైతుల కష్టం.. హోటళ్లకు లాభం

Apr 13 2026 7:26 AM | Updated on Apr 13 2026 7:26 AM

సాక్షి బళ్లారి: మధ్య ప్రాచ్య దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావంతో కొన్ని నెలలుగా కూరగాయల ధరలు పడిపోయాయి. అప్పులు చేసి ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేసిన అన్నదాతలు అప్పులపాలవుతున్నారు. పండించిన కూరగాయలకు పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది. నగరంలోని ఏపీఎంసీకి రోజూ బళ్లారి చుట్టుపక్కలతో పాటు పొరుగున ఆంధ్రప్రదేశ్‌ నుంచి రైతులు టమాటా, ఉల్లిగడ్డలు, వంకాయ, క్యారెట్‌, బీరకాయ, తదితర కూరగాయలను వాహనాల్లో తీసుకొచ్చి హోల్‌సెల్‌గా విక్రయిస్తుంటారు. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి కూరగాయల ధరలు నేలచూపు చూస్తున్నాయి. టమాటా రూ.5, ఉల్లిగడ్డలు రూ.5, బీట్‌రూట్‌ రూ.10 లోపే, క్యారెట్‌ రూ.10, చిక్కుడు, దోసకాయ, క్యాబేజీ, తదితర కూరగాయలలను రైతుల నుంచి రూ.8 నుంచి రూ.10 లోపే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇక కమీషన్‌, జీఎస్టీ తదితరాలను పట్టుకుంటున్నారు. పెట్టుబడుల మాట అటు ఉంచితే కార్మిక వ్యయం, రవాణా ఖర్చులు కూడా దక్కడం లేదు.

గ్యాస్‌ ధర పెరిగిందని చెబుతూ..

రిటైల్‌గా బహిరంగ మార్కెట్‌లో కూరగాయల ధరలు భారీగా పడిపోవడంతో వినియోగదారులు కూడా రైతుల కష్టాలను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల ధరలు భారీగా పడిపోయినప్పటికీ హోటళ్లలో మాత్రం రోజు రోజుకు ధరలు పెంచేస్తున్నారు. అమెరికా, ఇజ్రాయిల్‌, ఇరాన్‌ మధ్య యుద్ధం కొనసాగుతుండటంతో గ్యాస్‌ సిలిండర్లు దొరకడం లేదనే సాకు చెబుతున్నారు. ఇడ్లీ, దోసె, వడ, పూరీ, భోజనాలు తదితర ఆహార పదార్ధాల ధరలను రెట్టింపు చేసుకుని లాభాలు ఆర్జిస్తున్నారు. కూరగాయల ధరలు చౌకగా లభిస్తున్నప్పటికీ ఇష్టానుసారంగా హోటళ్లలో ధరలు పెంచి దోచుకుంటున్నారు. ఓ వైపు కూరగాయల ధరలు కుప్పకూలి రైతులు నష్టాల్లో కుదేలవుతున్నారు. విత్తనాలు, ఎరువులు, మందులు, కార్మిక ఖర్చులు, రవాణా ఖర్చులు పెరుగుతుండటంతో ఆదుకోవాల్సిన పాలకులు, చోద్యం చూస్తున్నారు.

పడిపోయిన కూరగాయల ధరలు

కుదేలవుతున్న అన్నదాతలు

గ్యాస్‌ ధర పెరిగిందని చెబుతూ

హోటళ్లలో భారీగా ఆహారం ధరల పెంపు

దోపిడీకి తెరలేపిన హోటళ్ల యజమానులు

Advertisement
 
Advertisement
Advertisement