హొసపేటె: ఉపాధ్యాయులు గణిత కిట్లను వినియోగించుకుని తమ బోధనలో పరిపూర్ణత సాధించాలి. తద్వారా పిల్లలకు కార్యకలాప–ఆధారిత విద్యను అందించాలని విషయ తనిఖీ అధికారి, ఎస్‌ఎస్‌ఎల్‌సీ నోడల్ అధికారి హులిబండి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక చిత్తవాడిగి ప్రభుత్వ ప్రీ–యూనివర్సిటీ కళాశాలలో పాఠశాల విద్యాశాఖ, అక్షర ఫౌండేషన్ సహకారంతో గణిత అభ్యాస ఉద్యమం కార్యక్రమం కింద జిల్లా స్థాయి గణిత సదస్సు, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకు ఉత్తమ విద్యను అందించే లక్ష్యంతో పాఠశాలలో మంచి వాతావరణాన్ని కల్పించేందుకు ఎస్‌డీఎంసీ అధ్యక్షులు, సభ్యులు ఉపాధ్యాయులతో కలిసి పని చేయాలని సూచించారు. డైట్ అధ్యాపకులు, నోడల్ అధికారి గర్హ్ ప్రభురాజ్ పాటిల్ మాట్లాడుతూ.. గణిత ఉపాధ్యాయుల కోసం రూపొందించిన గణిత అభ్యాస ఉద్యయం 2.0 ఆఫ్‌లైన్ శిక్షణపై వివరించారు. గణిత కిట్లు అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు చేరాయని.. ఉపాధ్యాయులందరూ ఈ శిక్షణ వనరులను వినియోగించుకుని పిల్లలకు కార్యకలాప–ఆధారిత విద్యను అందించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో చిత్తవాడిగి పీయూ కాలేజీ ప్రిన్సిపల్ నాగరాజ్, ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు శివానంద్ తదితరులు పాల్గొన్నారు.


