హుబ్లీ: బాడుగ కోసం వరసగా ఆటోలను నిలిపే క్రమంలో జరిగిన గొడవ పర్యవసానం ఒకరి హత్యకు దారి తీసింది. ఈ ఘటన బెళగావి జిల్లా కాగవాడ తాలూకా మంగసూలి గ్రామంలో చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్ అశోక్ వడ్డర్ హత్యకు గురైన వ్యక్తి. రెండు రోజుల క్రితం ఊరిలో జాతర నేపథ్యంలో భక్తుల సందడి ఎక్కువగా ఉంది. రోజూ మాదిరిగా వరుసలో నిలబెడుతున్న ఆటోలు ఆ రోజు మాత్రం ఈ నియమాన్ని ఉల్లంఘించి ఇష్ట వచ్చినట్లు ప్రయాణికులను బస్టాండ్ నుంచి ఆలయానికి తీసుకెళ్లడం తిరిగి తీసుకుని రావడం చేశారు. అశోక్ తన ఆటో వెనుక ఉన్నప్పటికీ ఇద్దరు ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లాడు. దీన్ని గమనించిన మరో ఆటో డ్రైవర్ శివ.. అశోక్ బాడుగ దింపి వచ్చిన వెంటనే గొడవకు దిగాడు. అంతేగాక మరో ఇద్దరు స్నేహితులతో కలసి అశోక్‌పై దాడి చేసి హతమార్చారు. అతడి వద్ద ఉన్న నగదు తీసుకుని, ఆటో వెనుక సీట్లో అశోక్‌ను పడుకోబెట్టి అక్కడి నుంచి పరారీ అయ్యారు. కాగవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలించారు. నిందితులు శివ, సాగర్, వినోద్‌ను అరెస్ట్ చేశారు. 20 రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన అశోక్ దారుణ హత్యకు గురి కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆటో డ్రైవర్ దారుణ హత్య


