హుబ్లీ: జంట నగరాల్లోని జిమ్ కేంద్రాలు, లవ్ జిహాద్ కేసులకు మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకునేందుకు నగరంలోని బీవీబీ కళాశాల క్యాంపస్ మీటింగ్ హాల్‌లో శుక్రవారం జిమ్ యజమానులు, ట్రైనర్లతో సమావేశం నిర్వహించారు. జంట నగరాల పోలీస్ కమిషనర్ శశికుమార్ మాట్లాడుతూ.. కోచ్‌ల పూర్వపరాల నేపథ్యం పరిశీలన, సభ్యుల మొబైల్ కనెక్షన్ నిషేధం, తదితర కట్టుదిట్టమైన నియమాలను తప్పని సరిగా పాటించాలని ఆదేశించారు. ఒక వేళ ఆ నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిమ్ సురక్షతపై ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జిమ్‌లకు వచ్చే యువతులు, మహిళలపౌ అసభ్యకరంగా ప్రవర్తించే కోచ్‌లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జంట నగరాల్లోని కొన్ని జిమ్‌లు లవ్ జిహాద్‌కు అడ్డాలుగా మారుతున్నాయని హిందు సంఘాల నేతలు, ప్రముఖులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. సమావేశంలో 200 మందికి పైగా జిమ్ ట్రైనర్లు, జిమ్ యజమానులు పాల్గొన్నారు.
పీయూసీ ఫలితాల్లో
రాయచూరుకు 31వ స్థానం
రాయచూరు రూరల్: ద్వితీయ పీయూసీ ఫలితాల్లో రాయచూరు జిల్లా 31వ స్థానంలో నిలిచిందని ఇంటర్‌మీడియట్ బోర్డు జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరప్ప వెల్లడించారు. శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లాలో 21,383 మంది ద్వితీయ పరీక్షలు రాయడం జరిగిందన్నారు. వీరిలో 13,881 మంది విద్యార్థులు ఉతీర్ణులైనట్లు తెలిపారు. 74.72 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు పేర్కొన్నారు. పీయూసీ ఫలితాల్లో రాయచూరు జిల్లా గత ఏడాది 30వ స్థానంలో ఉండగా.. ఈ ఏడాది 31వ స్థానానికి పడిపోయినట్లు చెప్పారు. దేవదుర్గ రేఖ 591, అనుషా పాటిల్ 583, సంతు 562, భాగ్య 558, కవిత 588 మార్కులతో సత్తా చాటారు.
టిప్పర్ ఢీకొని
బైక్ చోదకుడికి గాయాలు
హొసపేటె: బట్టలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన ఒక యువకుడిని వేగంగా వచ్చిన ఓ టిప్పర్ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. నగరంలోని పడుగుత్తి కళ్యాణ మండపం సమీపంలో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. బైక్ రైడర్‌ను కొప్పళలోని సర్దార్ గల్లీకి చెందిన కాసిం అలీ రాజా సభాగా గుర్తించారు. తీవ్ర గాయపడిన ఇతడికి ఉప విభాగ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం కొప్పళ జిల్లా ఆస్పత్రికి తరలించారు. టిప్పర్, బైక్ రెండూ సీబీఎస్ సర్కిల్ నుంచి కొప్పళ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.
ఇంటర్ ప్రతిభావంతులకు సత్కారం
చిక్కబళ్లాపురం: ద్వితీయ పీయూ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన నగరంలోని బెస్ట్ కళాశాల విద్యార్థులు పదిమందిని యాజమాన్యం ఘనంగా సత్కరించింది. 401 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 391 మంది ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ రఘునాథ్ తెలిపారు.
వృద్ధులకు అన్నదానం
శివాజీనగర: కాగినెల కనక గురుపీఠం డాక్టర్ నిరంజనానందపురి స్వామీజీ 50వ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం కొట్టూరు ఆనాథాశ్రమంలో వృద్ధులకు బొబ్బట్లతో కూడిన భోజనం ఏర్పాటు చేశారు. హగరిబొమ్మనహళ్లి పురసభ మాజీ అధ్యక్షుడు ఎం.మరి రామప్ప మాట్లాడుతూ నిరంజనానందపురి స్వామీజీ సమాజానికి అందిస్తున్న సేవలు అనన్యమన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోరి గోణిబసప్ప, పురసభ నామినేటెడ్ సభ్యుడు యు.బాళప్ప తదితర నాయకులు పాల్గొన్నారు.
యంత్రంలో
చిక్కుకుని బాలుడు మృతి
హోసూరు: లేత్ యంత్రంలో చిక్కుకుని బాలుడు మృతి చెందిన ఘటన సిఫ్‌కాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల మేరకు.. తిరుపత్తూరు జిల్లాకు చెందిన రమేష్ కొడుకు మోహన్ రాజ్ (16). పాఠశాలకు సెలవులు వదలడంతో హోసూరులో నివాసముంటున్న బంధువుల ఇంటికి వెళ్లాడు. పారిశ్రామిక వాడలో అతడి మామ నిర్వహిస్తున్న పరిశ్రమలో లేత్ యంత్రాన్ని ఆపరేట్ చేస్తుండగా అకస్మాత్తుగా యంత్రంలో చిక్కుకుని మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సిఫ్‌కాట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


