బతికుండగానే చనిపోయినట్లు నమోదు | - | Sakshi
Sakshi News home page

బతికుండగానే చనిపోయినట్లు నమోదు

Apr 11 2026 9:28 AM | Updated on Apr 11 2026 9:28 AM

రాయచూరు రూరల్‌: బతికున్న మహిళను మరణించిందంటూ రికార్డుల్లో నమోదు చేసిన ఘటన రాయచూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాయచూరులోని లాల్‌ బహదూర్‌ శాస్త్రి నగర్‌లో నివసిస్తున్న ఖాజాబీ చౌకధరల దుకాణం నుంచి ఆహార పదార్థాలు తీసుకుంటోంది. ఏడాది క్రితం జీవనోపాధి కోసం ముంబాయి వెళ్లింది. అప్పటి నుంచి చౌక ధరల దుకాణంలో వేలిముద్రలు వేయలేదు. రేషన్‌ సరుకులు తీసుకోక పోవడంతో ఆమె మరణించినట్లు అధికారులు రికార్డుల్లో నమోదు చేశారు. దీంతో ఖాజాబీకి సర్కార్‌ నుంచి రావాల్సిన గృహలక్ష్మి, పింఛన్‌ అందకుండా పోయాయి. ఫలితంగా రేషన్‌కార్డు కూడా రద్దు అయ్యింది. పౌరసరఫరా శాఖ అధికారులు స్పందించి రేషన్‌కార్డు మంజూరు చేయాలని బాధితురాలు కోరుతోంది.

పేదలకు సేవ చేయడం హర్షణీయం

రాయచూరు రూరల్‌: పేదలకు ఉచిత సేవలందించడం హర్షణీయమని నవోదయ వైద్య కళాశాల అధికారి రామమోహన గుప్తా అన్నారు. నగరంలోని నవోదయ వైద్య కళాశాలలో ఔషధ విధానం, ఉత్పాదన, విశ్లేషణ, క్లినికల్‌ ఫార్మసీ, రీసెర్చ్‌, ఫార్మోకోమో అంశాలపై మూడు రోజల పాటు జరగనున్న సెమినార్‌ శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా రామమోహన గుప్తా మాట్లాడుతూ.. కళ్యాణ కర్నాటకలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆరోగ్య పరీక్షలు చేయడానికి వీలు కల్పించినట్లు అవుతుందన్నారు. నవోదయ వైద్యకీయ కళాశాల చేస్తున్న వైద్య సేవలు అనన్యమన్నారు. కార్యక్రమంలో నవోదయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ దొడ్డయ్య, అమృత రెడ్డి, పునీత్‌, శివరాజ్‌ గౌడ, సురేష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

ఐడీపీఎస్‌ ఇండిపెండెంట్‌ కాలేజీ విద్యార్థుల ప్రతిభ

సాక్షి, బళ్లారి: 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ద్వితీయ పీయూసీ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. నగర శివారులోని కప్పగల్‌ రోడ్డులో ఉన్న ఐడీపీఎస్‌ ఇండిపెండెంట్‌ పీయూ కాలేజీ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఎం.సుప్రియ 591, ఏ.ఆదిశేష్‌ 579, హర్షిల్‌ జైన్‌ 579, హరిణి 578, భూమిక 576, కిరణ్‌ 576, మేఘన 576, దీపిక 575, మనోజ్‌ 575, ప్రకృతి 574, త్రిష 571, అక్షయ 571, మధుబాయి 571, యువరాణి 570 మార్కులు సాధించారు. కళాశాలలో 98 శాతానికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ఎండీ జయ చంద్రారెడ్డి తెలిపారు.

మురిక వాడల్లో

సౌకర్యాలు శూన్యం

రాయచూరు రూరల్‌: పట్టణ ప్రాంతాల్లోని మురికి వాడల్లో నివాసం ఉంటున్న ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని స్లం క్రియా వేదిక రాష్ట్ర సంచాలకుడు నరిసింహమూర్తి పేర్కొన్నారు. శఽుక్రవారం స్లం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మురికివాడల్లో నివసిస్తున్న వారికి ఆరోగ్యం, విద్య, ఆహరం, భూమి, ఇల్లు, ఉద్యోగాలను సర్కార్‌ అందించాలన్నారు. రాష్ట్రంలో వసతి పథకం నీరుగారి పోయిందని తెలిపారు. పేదలు అద్దె ఇళ్లలో ఉంటూ ఆర్థికంగా నష్టపోతున్నారని ఆరోపించారు. మురికి వాడల అభివృద్ధి కేవలం కాగితాలకే పరిమితమైందని మండిపడ్డారు. కార్యక్రమంలో అనిల్‌ కుమార్‌, జనార్దన, బసవరాజ్‌, నాగరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

తాగునీరు సరఫరా చేయాలని ఆందోళన

రాయచూరు రూరల్‌: వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా తాగునీరు సరఫరా చేయాలని మహిళలు డిమాండ్‌ చేశారు. శుక్రవారం లింగసూగురు తాలుకా గురుగుంట గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి అధికారి పరారీ కావడంతో అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజా ప్రతినిధులు, మంత్రులు అధికారులకు ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా స్పందించి తాగునీరు సరఫరా చేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement