హొసపేటె: జిల్లాలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులు, నీటి సరఫరా ప్రాజెక్టులను నిర్దేశిత సమయంలోపు పూర్తి చేసి ప్రజలకు లబ్ధి చేకూర్చాలని జిల్లా ఇన్‌చార్జి కార్యదర్శి డాక్టర్.కేజీ.జగదీష్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం నగరంలోని జిల్లా పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన వివిధ శాఖల పురోగతి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. హోస్పేట్‌తో సహా జిల్లాలోని వివిధ తాలూకాల్లో అమలులో ఉన్న నీటి సరఫరా ప్రాజెక్టుల పురోగతిని సమీక్షిస్తూ, ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలు లాభాపేక్షతో పని చేస్తాయని తెలిపారు. పనుల్లో జాప్యం జరిగినా లేదా నాణ్యత విషయంలో రాజీపడినా అటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో అధికారులు పరస్పర సమన్వయంతో జాగ్రత్తగా పని చేయాలన్నారు. వేసవి కాలం సమీపిస్తున్నందున, ప్రజలు నీటి కొరతను ఎదుర్కొకుండా చూడటమే మన ప్రథమ ప్రాధాన్యత అన్నారు. అధికారులు ముందు చూపుతో వ్యవహరించాలని తెలిపారు. అభివృద్ధి పనుల కోసం వివిధ శాఖలు విడుదల చేసిన నిధులను దుర్వినియోగం చేయకుండా సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా పంచాయతీ సీఈఓ అక్రమ్ షా మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలోని హరపనహళ్లి తాలూకాలో తీవ్ర నీటి సమస్య ఉందని, ప్రైవేట్ ట్యూబ్‌వెల్స్, ట్యాంకర్ల ద్వారా తగినంతగా నీటిని సరఫరా చేస్తున్నారని తెలియజేశారు.
నమూనా అంగన్‌వాడీ భవనం నిర్మించండి
జిల్లా ఇన్‌చార్జి కార్యదర్శి, జిల్లాలోని ఎంపిక చేసిన ఐదు ప్రదేశాలలో పిల్లల ఆటలకు మద్దతుగా క్రీడా పరికరాలను ఏర్పాటు చేసి, ఒక మంచి నమూనా అంగన్‌వాడి భవనాన్ని నిర్మించాలని మహిళా, శిశు సంక్షేమ శాఖను ఆదేశించారు. దీనికి సంబంధిత అధికారులు సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ సీఈఓ నోంగ్‌జోయ్ మహమ్మద్ అలీ అక్రమ్ షా, జిల్లా పంచాయతీ డిప్యూటి సెక్రటరీ కే.తిమ్మప్ప, ప్రాజెక్ట్ డైరెక్టర్ అన్నదాన స్వామి, గ్రామీణ తాగునీటి, పారిశుధ్య శాఖ ఇంజనీర్ ఎస్.దీప, డీడీపీఐ వెంకటేష్ రామచంద్రప్ప, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.


