బాగలకోటెలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటరుకార్డులతో వేచి ఉన్న పురుష ఓటర్లు
దావణగెరెలో ఓ పోలింగ్ కేంద్ర ం వద్ద ఓటు వేసేందుకు క్యూలో నిలబడిన మహిళా ఓటర్లు
సాక్షి,బళ్లారి: దావణగెరె దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే శ్యామనూరు శివశంకరప్ప, బాగల్‌కోటె అసెంబ్లీ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే హెచ్.వై.మేటి మృతితో జరిగిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు జరిగిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలు భారీ పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించారు. మండుటెండలో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అన్ని పోలీంగ్ కేంద్రాల వద్ద ఉదయం కాస్త మందకొడిగా పోలింగ్ సాగినా సాయంత్రం కల్లా పోలింగ్ సరళి బాగా పుంజుకుంది. పోలింగ్ ముగిసే సమయానికి దావణగెరె దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ 68.43 శాతం, బాగల్‌కోటె అసెంబ్లీ నియోజకవర్గంలో 68.74 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిసింది.
ఉత్సాహంగా ఓటెత్తారు
కాగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు యువకులు, వృద్ధులు, మహిళలు ఉత్సాహంగా బారులు తీరారు. దీంతో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద గుడికూడిన ఓటర్లతో సందడి వాతావరణం నెలకొంది. దావణగెరె దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్యామనూరు శివశంకరప్ప మనవడు శ్యామనూరు సమర్ధ్ పోటీ చేయగా, బీజేపీ తరుపున శ్రీనివాస దాస కరియప్ప, బాగల్‌కోటె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉమేష్ మేటి, బీజేపీ తరఫున వీరణ్ణ చరంతిమఠ బరిలో నిలిచారు. ఫలితాలు మే 4వ తేదీన వెలువడనున్న నేపథ్యంలో అప్పటి వరకు అభ్యర్థులకు టెన్షన్ తప్పని పరిస్థితి నెలకొంది. ఉప ఎన్నిక ముగిసిన తర్వాత ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద నుంచి ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలకు తరలించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపునకు 25 రోజుల గడువు ఉండటంతో అప్పటి వరకు స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తును కొనసాగించనున్నారు.
బాగలకోటెలో ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్థి
దావణగెరెలో ఓటు వేసేందుకు బారులు తీరిన మహిళా ఓటర్లు
ఉప ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత
ఈవీఎంల్లో ఓటరు దేవుళ్ల తీర్పు నిక్షిప్తం
మే 4వ తేదీన వెలువడనున్న ఫలితాలు


