తోక జాడించారో జాగ్రత్త.! | - | Sakshi
Sakshi News home page

తోక జాడించారో జాగ్రత్త.!

Apr 10 2026 10:33 AM | Updated on Apr 10 2026 10:33 AM

రౌడీలకు పోలీసు కమిషనర్‌ వార్నింగ్‌

హుబ్లీ: హుబ్లీలో గురువారం రౌడీలకు నిర్వహించిన పరేడ్‌లో పోకిరీలు, ఆకతాయిలకు నగర పోలీస్‌ కమిషనర్‌ శశికుమార్‌ గట్టిగా వార్నింగ్‌ ఇచ్చారు. తోక జాడిస్తే ఖబడ్దార్‌.. జిల్లా సరిహద్దుల నుంచి బహిష్కరిస్తానని హెచ్చరించారు. అంతేగాక మంచి నడవడిక చూపిన 816 మంది రౌడీలను రౌడీ జాబితా నుంచి విముక్తిని కల్గిస్తూ పాత అలవాట్లకు కొనసాగించే రౌడీలపై కొరడా ఝళిపించారు. స్థానిక సీఏఆర్‌ మైదానంలో జరిగిన రౌడీ పరేడ్‌లో 450 మందికి పైగా రౌడీలు పాల్గొన్నారు. అతి వెకిలి చేష్టలు, అతి వేషాలు వేస్తే పాత చరిత్ర వెలికితీసి శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని గట్టిగా హెచ్చరించారు. కాగా ఇప్పటికే 30 మందికి పైగా రౌడీలను సరిహద్దుల నుంచి బహిష్కరించే ప్రక్రియ మొదలైందన్నారు. అలాగే మంచి నడవడిక అలవాటు చేసుకొని బతుకుతున్న మాజీ రౌడీలకు శుభవార్త చెప్పారు. 2026 ప్రారంభంలో జంట నగరాల్లో 1320 మంది రౌడీషీటర్లు ఉండేవారు. వీరిలో మంచి మార్గంలో నడుస్తున్న 816 మందిని రౌడీ షీటర్‌ జాబితా నుంచి తొలగించారు. ప్రస్తుతం నగరంలో 510 మంది యాక్టివ్‌ రౌడీ షీటర్లు ఉండగా, ఈ ఏడాది కొత్తగా 100 మందిపై నిఘా పెట్టి వారిని రౌడీషీట్‌ జాబితాలో చేర్చే ప్రక్రియ జరుగుతోంది. మొత్తానికి నగర పోలీసులు జంట నగరాల్లో శాంతి భద్రతలను కాపాడటానికి కఠిన చర్యలు తీసుకుంటుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

గుర్తు తెలియని

మృతదేహం లభ్యం

హొసపేటె: కమలాపుర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హెచ్‌పీసీ ఫోర్‌ బే కాలువలో సుమారు 40– 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు సుమారు 5.6 అడుగుల ఎత్తు, తెల్లని ఛాయ కలిగి తెల్లని, సగం చేతుల, చారల చొక్కా, నలుపు తెలుపు చారల లుంగీ, ఎరుపు, పసుపు రంగు తలపాగా ధరించాడు. మృతుని వారసులు ఎవరైనా ఉంటే కమలాపుర పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐని లేదా 9480805762 నంబరును సంప్రదించాలని ఓ ప్రకటనలో తెలిపారు.

ద్వితీయ పీయూసీలో సత్తా

సాక్షి బళ్లారి: 2025–26వ విద్యాసంవత్సరపు ద్వితీయ పీయూసీ పరీక్షల్లో శ్రీచైతన్య పీయూ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. కళాశాల విద్యార్థులు ఇషాంత్‌ రాయ్‌ 593, కె.త్రిషా 592, శ్రీహిత 591, ఐశ్వర్య 589, హెచ్‌.లిఖిత్‌ 588, కే.మల్లేశ్వరి 588, జే.వైష్ణవి 586, పీ.నందుశ్రీ 586, సుజాత 585, ఎం.రేఖారెడ్డి 585, సాత్విక 585, వీ.లక్ష్మీభవాని 584 మార్కులతో ఉత్తమ ఫలితాలను సాధించారు. వీరిలో డిస్టింక్షన్‌లో 440, ఫస్ట్‌క్లాస్‌లో 525, సెకండ్‌ క్లాస్‌లో 51 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు కళాశాల కరస్పాండెంట్‌ తెలిపారు.

ద్వితీయ పీయూసీలో

మెరుగైన ఫలితాలు

జిల్లాలో 78.69 శాతం ఉత్తీర్ణత

సాక్షి,బళ్లారి: గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ద్వితీయ పీయూసీలో మెరుగైన ఫలితాలు వచ్చాయి. గురువారం సాయంత్రం ద్వితీయ పీయూసీ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 78.69 శాతం ఫలితాలు సాధించినట్లు విద్యా శాఖ అధికారులు వెల్లడించారు. గత ఏడాది మెరుగైన ఫలితాలు రాకపోవడంతో రాష్ట్రంలో బళ్లారి జిల్లా 24వ స్థానానికి పడిపోయిన సంగతి విదితమే. ఈ ఏడాది విద్యాశాఖ అధికారులు తీసుకున్న నిర్ణయాలు, చర్యలకు తోడు విద్యార్థులు కూడా కష్టపడి చదవడంతో ఫలితాలు కాస్త మెరుగుపడినట్లు అధికారులు భావిస్తున్నారు.

ప్రజా సేవకు పదవులు ముఖ్యం కాదు

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలో ప్రజా సేవ చేయడానికి పదవులు ముఖ్యం కాదని రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు రాజేంద్ర కుమార్‌ పేర్కొన్నారు. దేవదుర్గ భవనంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల ఆశయ సాధనకు తన వంతు సహకారం అందిస్తామన్నారు. తనను ఎన్నుకున్న వారికి రుణపడి ఉంటానన్నారు. ఉద్యోగులు కట్టబెట్టిన పదవికి న్యాయం చేస్తానన్నారు. విద్యారత్న, సేవా భూషణ్‌ అవార్డులను అందించారు. నాగేష్‌ గౌడ, ప్రేమలతా రెడ్డి, చంద్రశేఖర్‌ పాటిల్‌, సురేష్‌, బోరేగౌడ, చరణ్‌రాజ్‌, విశ్వనాథ్‌, బసవరాజ్‌లున్నారు.

శాంతరస సాహిత్య

సేవలు అనన్యం

రాయచూరు రూరల్‌: కన్నడ సాహిత్య రంగానికి ప్రముఖ రచయిత శాంతరస అందించిన సేవలు అనన్యమని రాయచూరు విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ శివానంద అభిప్రాయ పడ్డారు. ఆదివారం ఎస్‌ఆర్‌కే విద్యాలయంలో శాంతరస సంస్మరణ దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. శాంతరస త్రిభాషా సాహిత్యంతో ప్రపంచానికి చాటిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. కసాప అధ్యక్షుడు విజయ రాజేంద్ర, లక్ష్మీదేవి, బసవప్రభు, వెంకటేష్‌, రెహమాన్‌, వీరహనుమాన్‌, బసవరాజ్‌ కళస, రంగణ్ణ పాటిల్‌, విరుపాక్షి, భీమనగౌడ, రావుత్‌రావ్‌లున్నారు.

ఇంటర్‌ పరీక్షల్లో జిల్లాకు 14వ స్థానం

కోలారు: ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో కోలారు జిల్లా 14వ స్థానంలో నిలిచింది. వాణిజ్య విభాగంలో నగరంలోని మహిళా సమాజ కళాశాల విద్యార్థిని చిరంతన, విజ్ఞాన విభాగంలో బేతమంగల మదన్‌ బంగారుపేట ఎస్‌డీసీ కళాశాల అర్చన, కళా విభాగంలో నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల విద్యార్థిని నయన ప్రథమ స్థానంలో నిలిచారు. విజ్ఞాన విభాగంలో నగరంలోని సహ్యాద్రి కళాశాల విద్యార్థిని లయ సత్తా చాటింది.

Advertisement
 
Advertisement
Advertisement