విద్యుదాఘాతంతో యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

Apr 10 2026 10:33 AM | Updated on Apr 10 2026 10:33 AM

మృతుడు బళ్లారి జిల్లా వాసి

కళ్యాణదుర్గం రూరల్‌: విద్యుత్‌ షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు... బళ్లారి జిల్లా మోకా సమీపంలోని సింధవాళ గ్రామానికి చెందిన బసవరాజు (32)కు భార్య ఛైత్ర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతను కొన్ని రోజుల క్రితం కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామంలో మొక్కజొన్న పంట కోతకు మిషన్‌ కూలీగా వచ్చాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం కోత మిషన్‌ పైకి ఎక్కి యంత్రాన్ని శుభ్రం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పైనున్న విద్యుత్‌ తీగలు తగిలి షాక్‌కు గురై కింద పడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే కళ్యాణదుర్గంలోని సీహెచ్‌సీకి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనపై కళ్యాణదుర్గం రూరల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

వంతెనకు బైక్‌ ఢీ.. ముగ్గురు దుర్మరణం

రాయచూరు రూరల్‌: వంతెనకు ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన బీదర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. మృతులను హుమ్నాబాద్‌ తాలూకా హళ్లిఖేడకు చెందిన వెంకట్‌(40), అతని భార్య శిల్ప(35), కుమార్తె రక్షిత(12)గా పోలీసులు గుర్తించారు. వేగంగా దూసుకుచ్చిన ద్విచక్ర వాహనం అదుపు తప్పి వంతెనకు ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ వారిని బీదర్‌లోని బిమ్స్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సర్కారు బడిలోనే విద్యార్థులను చేర్పించాలి

రాయచూరు రూరల్‌: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు విద్యార్థులను చేర్పించాలంటూ ర్యాలీ చేపట్టారు. కొప్పళ జిల్లా గంగావతిలోని 22వ వార్డు గుండమ్మ క్యాంప్‌లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి వీధుల్లో సంచరిస్తూ 2025–26వ విద్యా సంవత్సరానికి పిల్లలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించడానికి ముందుకు రావాలంటూ జాతాను నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక పబ్లిక్‌ పాఠశాలల పేరుతో కన్నడ బడులను మూసి వేయడానికి కుట్ర పన్నుతున్న నేపథ్యంలో నూతన ఒరవడికి క్యాంప్‌ వాసులు శ్రీకారం చుట్టారు. ఐదేళ్లు పైబడిన పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలలకు బదులుగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఇంటింటా ప్రచారం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత పాఠ్య పుస్తకాలు, బోధన, పాలు, భోజనం, దుస్తులు, గుడ్డు, బూట్లు, అరటి పండు, ఆరోగ్య చికిత్సలు వంటివి అందుబాటులో ఉంటాయని, వాటి ప్రాధాన్యతను గురించి వివరించారు.

ఉపాధ్యాయినికి సన్మానం

రాయచూరు రూరల్‌: నేటి యుగంలో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని మడ్డిపేట ప్రాథమికోన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయిని రూపా పేర్కొన్నారు. నగరంలో గురువందన కార్యక్రమంలో అవార్డును అందుకుని ఆమె మాట్లాడారు. జ్ఞాన సముపార్జనకు విద్య, సాహిత్యం చేదోడు వాదోడుగా ఉంటాయన్నారు. విద్యార్థులు పాఠ్యాంశాలకు తోడు పాఠ్యేతర విషయాలపై ఆసక్తి కనబరచాలని అన్నారు.

ఆరోగ్యంపై ఆసక్తి పెంచుకోవాలి

రాయచూరు రూరల్‌: నేటి కాలంలో ప్రజలు ఆరోగ్యంపై ఆసక్తిని పెంచుకోవాలని జిల్లా ఆరోగ్య శాఖాధికారి సురేంద్రబాబు పిలుపునిచ్చారు. జిల్లా ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలుసుకోవాలన్నారు. మానవుడి జీవన శైలి, ఆహార పద్ధతిలో వచ్చిన మార్పుల వల్ల అనారోగ్యం పాలవుతున్నారన్నారు. సమావేశంలో వైద్యులు గణేష్‌, శివకుమార్‌, నాగరాజ్‌, సరోజ, లేపాక్షి, తాయప్ప, సురేష్‌, అడివప్పలున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement