వివాహిత అదృశ్యం కేసులో మలుపు | - | Sakshi
Sakshi News home page

వివాహిత అదృశ్యం కేసులో మలుపు

Apr 10 2026 10:33 AM | Updated on Apr 10 2026 10:33 AM

హుబ్లీ: కొప్పళకు చెందిన నవ వివాహిత అదృశ్యమైన కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. పెళ్‌లైన రెండు నెలలకే మెట్టింటి నుంచి కనిపించకుండా పోయిన ఆ యువతి ముస్లిం యువకుడితో హుబ్లీలో కనిపించింది. ఆ మేరకు పోలీస్‌ స్టేషన్‌లో కుటుంబ సభ్యుల ఎదుటే ఆ యువతి ప్రేమికుడితోనే కలిసి ఉంటానని మొండికేసింది. అయితే సదరు భర్త ఇప్పటికే అవమానం తట్టుకోలేక మా నాన్న గుండెపోటుతో చనిపోయాడు. అందుకే తమకు పరిహారం చెల్లించాలని భర్తతో పాటు కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు. కొప్పళలోని గౌరి అంగళ నివాసి నాగరాజ్‌ను పెళ్లి చేసుకున్న రాయచూరు జిల్లా సింధనూరుకు చెందిన సంజన అనే యువతి పెళ్‌లైన రెండు నెలలకే భర్తను విడిచి కనిపించకుండా పోయింది.

మనోవేదనతో కుటుంబ పెద్ద మృతి

విషయం తెలిసిన మామ అనగా భర్త తండ్రి అవమాన భారంతో మనోదేవనకు గురై అనారోగ్యం కృశించి గుండెపోటుతో మృతి చెందడంతో సర్వత్రా ఆవేదన వ్యక్తమైంది. ఈ కేసులో ప్రస్తుతం కీలక మలుపు చోటు చేసుకుంది. కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయిన యువతి సంజన బుధవారం రాజాబక్షి అనే ముస్లిం యువకుడితో హుబ్లీలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించి ఇద్దరిని కొప్పళ పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించారు. సొంత ఊరు గదగ్‌ జిల్లాకు చెందిన రాజబక్షి ఆటో డ్రైవర్‌. అతడికి పెళ్లి కూడా అయింది. అయినా అతడు యువతిని తీసుకొని వెళ్లిన ఘటన తాజాగా వెలుగు చూసింది. ఇద్దరిని పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించిన తక్షణమే సంజన భర్త, ఆయన బంధువులు స్టేషన్‌కు హుటాహుటిన వచ్చారు. అయినా ఆ నవవివాహిత తనకు రాజాబక్షినే కావాలని పట్టుబట్టింది.

నష్ట పరిహారం చెల్లించాలని భర్త డిమాండ్‌

ఆమె ఈ పిచ్చితనానికి, మొండిపట్టుకు కుటుంబ పెద్ద ప్రాణనష్టం జరిగిందని, అందుకు గాను తమను నష్ట పరిహారం చెల్లించాలని ఆమె భర్త నాగరాజ్‌ డిమాండ్‌ చేశారు. కాగా వీరిద్దరి వివాహం పరస్పర ఆమోదం మేరకు ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో కొప్పళలోని పార్థ కళ్యాణ మంటపంలో గత ఫిబ్రవరి 8న జరిగి నాగరాజ్‌, సంజన ఒకింటివారయ్యారు. ఆ తర్వాత ఈ కొత్త దంపతులు నాగరాజ్‌ ఇంటి తొలి అంతస్తులో ఉండేవారు. ఈ క్రమంలో గత మార్చి 21న రాత్రి 8.30 ప్రాంతంలో సంజన తనకు ఆరోగ్యం బాగోలేదని ఔషధాలు తేవాలని భర్త నాగరాజ్‌ను పురమాయించింది. నాగరాజ్‌ ఔషధాలను తేవడానికి వెళ్లి తిరిగి 15 నిమిషాల్లో రాగా ఆ సమయంలో భార్య సంజన ఇంట్లో కనిపించలేదు. అక్కడ, ఇక్కడ అన్ని చోట్ల వెతికినా ఆమె ఇక్కడికి రాలేదని అందరూ సమాధానం చెప్పారు. ఆమె బంధువుల ఇంట్లో కూడా ఆమె గురించి సమాచారం తెలియక పోవడంతో భర్త నాగరాజ్‌ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తన ఇంటి కొత్త కోడలు కనిపించకుండా పోవడంతో ఆ ఇంటి పెద్ద, ఆమె మామ కండప్ప గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.

హుబ్లీలో ముస్లిం యువకుడితో యువతి

కొప్పళ పోలీస్‌ స్టేషన్‌లో హైడ్రామా

Advertisement
 
Advertisement
Advertisement