హొసపేటె: కొప్పళ తాలూకాలోని కోళూరు సమీపంలో ఉన్న హిరేహళ్ల వద్ద అక్రమ ఇసుక తవ్వకాలు సాగిస్తున్న ఇద్దరిపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. అధికారిక ఇసుక కాంట్రాక్టర్లకు కేటాయించిన ప్రాంతానికి ఆవల నుంచి అక్రమంగా ఇసుకను వెలికి తీస్తున్నారన్న సమాచారం మేరకు తహసీల్దార్, భూగర్భ గనుల శాఖ అధికారులు, పోలీసు సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడి సమయంలో హిటాచీ యంత్రాల ఉపయోగించి ఇసుక తవ్వకాలు చేపడుతున్నట్లు తేలడంతో మురుగుప్ప వనకేరి, నీలేష్ మదరఖండి అనే ఇద్దరిపై కొప్పళ గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
తల్లిదండ్రులు మందలించారని ఉద్యోగి ఆత్మహత్య
హోసూరు: తాగుడుకు బానిసై విధులకు వెళ్లడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో జీవితంపై విరక్తి చెందిన ఉద్యోగి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన హోసూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల మేరకు.. హోసూరు సమీపంలోని వన్నలవాడి గ్రామానికి చెందిన అగస్టిన్ (27) ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. కొద్ది రోజులుగా విధులకు వెళ్లకుండా మద్యం సేవిస్తూ జులాయిగా తిరుగుతున్నాడు. విధులకు వెళ్లకుండా ఇంట్లో ఉంటే ఎలా అని తలిదండ్రులు మందలించారు. జీవితంపై విరక్తి చెందిన అగస్టిన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


