రాయచూరు రూరల్: వేసవిలో మూడు నెలల పాటు జిల్లాలో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా చూడాలని రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం జిల్లాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తుంగభద్ర నీటి సౌకర్యంపై ఆధారపడిన గ్రామాలకు, కృష్ణా నదీ తీర ప్రాంత పరిధిలోని గ్రామాలకు నీటి సరఫరాలో జాప్యం నెలకొనకుండా చూడాలని సూచిస్తూ నీటి సరఫరా చేపట్టాలని, విద్యుత్ కోత, మోటార్లు చెడిపోవడం, ఇతరత్ర కారణాలు చెప్పకుండా నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, నీటి కుంటలను నింపాలని పీడీఓలకు ఆదేశాలు జారీ చేయాలని టీపీ అధికారులకు సూచనలు జారీ చేశారు. జల ధార, జలజీవన్ మిషన్ పథకం పనులను మే నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బసనగౌడ దద్దల్, హంపయ్య నాయక్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో, అదనపు జిల్లాధికారి శివానంద, జెడ్పీ అధికారులు శరణ బసవ, రోణలున్నారు.
దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట
జిల్లాలో దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ పేర్కొన్నారు. బుధవారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధీనంలోని దివ్యాంగుల పునర్వసతి కేంద్ర భవన నిర్మాణానికి భూమిపూజ చేసి ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రాలకు వచ్చి వారి పనులు ముగించుకోడానికి వీలు కల్పించినట్లు అవుతుందన్నారు. సమావేశంలో శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బసనగౌడ దద్దల్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, నగరసభ కమిషనర్ జుబీన్ మహాపాత్రో, అదనపు జిల్లాధికారి శివానంద, జెడ్పీ అధికారులు శరణ బసవ, రోణలున్నారు.


