గని ప్రభావిత ప్రాంతాభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

గని ప్రభావిత ప్రాంతాభివృద్ధికి కృషి

Apr 9 2026 7:59 AM | Updated on Apr 9 2026 7:59 AM

హొసపేటె: గని ప్రభావిత జిల్లాల్లో కర్ణాటక మైనింగ్‌ ఎన్విరాన్‌మెంట్‌ రిస్టోరేషన్‌ కార్పొరేషన్‌( కేఈఎంఆర్‌సీ) ప్రారంభించిన సమగ్ర పర్యావరణ ప్రాజెక్టు అమలు ఊపందుకుంది. ఈ ప్రాజెక్టు కింద జిల్లా అభివృద్ధికి రూ.4,107 కోట్ల గ్రాంటు అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు వివిధ శాఖలకు చెందిన రూ.1,710 కోట్ల విలువైన పనులకు సంబంధించిన 99 ప్రతిపాదనలకు ఆమోదం లభించిందని కర్ణాటక గని ప్రభావిత ప్రాంత పునరుజ్జీవ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ బిజ్జూరా తెలిపారు. నగరంలోని జిల్లాధికారి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023 నుంచి జిల్లాలో వివిధ శాఖల క్రింద 99 ప్రతిపాదనలు సమర్పించగా, వాటిలో అటవీ శాఖకు రూ.148 కోట్లతో మరియమ్మనహళ్లిలోని జీటీటీసీ కళాశాల పనులకు రూ.19.65 కోట్లు, వివిధ శాఖల అభివృద్ధికి మొత్తం రూ.1,710 కోట్లు కేటాయించారు. గనుల ప్రభావిత ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, తాగునీటి సరఫరా, రోడ్ల అనుసంధానం, పాఠశాల భవనాలు వంటి మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తారన్నారు. పనుల అమలులో ఎలాంటి జాప్యం జరగకుండా, పారదర్శకంగా చేపడతారని ఆయన అన్నారు. మైనింగ్‌ వల్ల జిల్లాలో సహజ వనరులకు జరిగిన నష్టాన్ని పూడ్చడం, స్థానికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. గనుల ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత కల్పిస్తారన్నారు. జిల్లాధికారిణి కవిత ఎస్‌.మన్నికేరి, అటవీ శాఖ డిప్యూటీ కన్జర్వేటర్‌ అనుపమ పాల్గొన్నారు.

జిల్లాకు రూ.4,107 కోట్ల గ్రాంట్‌ లభ్యం

కేఈఎంఆర్‌సీ ఎండీ సంజయ్‌ బిజ్జూరా

Advertisement
 
Advertisement
Advertisement