మైసూరు: మైసూరు నగరాన్ని మాదక ద్రవ్యాల నుంచి విముక్తి చేసేందుకు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి, 30 మంది డ్రగ్ పెడ్లర్లను బహిష్కరించినట్లు మైసూరు నగర పోలీస్ కమిషనర్ సీమా లాట్కర్ తెలిపారు. మంగళవారం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలో దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు సుమారు 30 మంది పెడ్లర్లను నగరం నుంచి బహిష్కరించామన్నారు. అదనంగా ఒక పాత విక్రయదారుడిని ఎన్‌డీపీఎస్ చట్టం కింద బళ్లారి జైలుకు పంపినట్లు తెలిపారు. మైసూరుకు చెందిన ఇర్ఫాన్ పాషాపై 9 కేసులు ఉండగా.. మాదకద్రవ్యాలను విక్రయిస్తున్నాడన్నారు. అతడి నుంచి 28 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పోగొట్టుకున్న మీ మొబైల్ ఫోన్‌ను కనుగొనడంలో ’ఇ–లాస్ట్’ అనే యాప్ సహాయ పడుతుందన్నారు. గత 3 నెలల్లో దొంగిలించబడిన 144 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. 220 మొబైల్ ఫోన్‌లను గుర్తించి వాటిని 197 మంది సొంతదారులకు తిరిగి అప్పగించామన్నారు.


