బెంగళూరు కెంగేరిలో ఆటోల క్యూ
బనశంకరి: ఐటీ సిటీలో ఇంధన గ్యాస్ కష్టాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గే సూచనలు లేవు. ఇరాన్– ఇజ్రాయెల్ యుద్ధం వల్ల బెంగళూరులో తీవ్ర గ్యాస్ ఎద్దడి నెలకొంది. గత ఐదురోజులుగా కొరత మరింత తీవ్రమైంది. సిలికాన్ సిటీలో 130కి పైగా ఆటో ఎల్‌పీజీ గ్యాస్‌స్టేషన్లు మూతపడ్డాయి, నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. నగరవ్యాప్తంగా వివిధ కంపెనీలకు చెందిన 160 ఆటో ఎల్‌పీజీ స్టేషన్లకు వారం రోజుల నుంచి సక్రమంగా గ్యాస్ సరఫరా కావడం లేదు. దీంతో ఇప్పుడు 30 స్టేషన్లు మాత్రమే పనిచేస్తున్నాయి. సోమవారం కూడా గ్యాస్ ట్యాంకర్లు రాకపోవడంతో ఎల్‌పీజీ సరఫరా నాసిరకంగా మారింది.
గంటల కొద్దీ ఎదురుచూసినా..
ఆదివారం, సోమవారం నగరంలో అనేక ఎల్‌పీజీ గ్యాస్‌స్టేషన్ల వద్ద ఆటోడ్రైవర్లు పడిగాపులు పడటం కనిపించింది. కొన్ని స్టేషన్లు ముందు మూడుగంటలకు పైగా వేచిచూసినప్పటికీ గ్యాస్ లభించక మరో గ్యాస్ స్టేషన్‌కు పరుగులు తీశారు. రాజాజీనగర ఎల్‌పీజీ స్టేషన్ వద్ద మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే అందించి నోస్టాక్ బోర్డు పెట్టారు. ఎల్‌పీజీ ధర గణనీయంగా పెరిగింది. ఒక లీటరు రూ.65 ఉండగా ఇప్పుడు రూ.135 కు చేరుకుంది.
ఇల్లు గడవడం లేదని ఆవేదన
రోజులో ఐదారు గంటలు గ్యాస్ కోసమే అయిపోతోంది, మాకు గ్యారంటీ పథకాలు వద్దని, గ్యాస్ ఇవ్వాలని, గ్యాస్ లేకపోతే ఉపాధి ఉండదని ఆటోవాటాలు చెప్పారు. ఇల్లు గడవదు, పిల్లలకు స్కూలు ఫీజులు కట్టలేము అని వాపోయారు. అనేకమంది ఆటోడ్రైవర్లు ఆటోలు నడవక, ఇంటి అద్దెలు చెల్లించలేక ఇళ్లు ఖాళీచేసి సొంత ఊర్లకు వెళుతున్నారు. సమస్యను పరిష్కరించకపోతే నగర రవాణా వ్యవస్థ దెబ్బతినే ప్రమాదముంది. ఆర్థిక సాయం చేసి తమ కుటుంబాలను ఆదుకోవాలని డ్రైవర్లు కోరుతున్నారు. మంగళవారం సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్, రవాణాశాఖమంత్రి రామలింగారెడ్డి తదితరులను కలుస్తామని డ్రైవర్ల సంఘాల నాయకులు తెలిపారు.
రాజధాని నగరంలో తీవ్ర కటకట
ఆటోడ్రైవర్లకు తీరని కష్టాలు
సర్కారు ముందు సంకటం


