మహిళపై మూక దాడి | - | Sakshi
Sakshi News home page

మహిళపై మూక దాడి

Apr 7 2026 8:07 AM | Updated on Apr 7 2026 8:07 AM

దొడ్డబళ్లాపురం: పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహిళ వ్యభిచారం చేస్తోందనే అనుమానంతో స్థానిక జనం ఇంట్లోంచి బయటకు ఈడ్చి దాడి చేసిన సంఘటన బెంగళూరు వర్తూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. 4వ తేదీన రాత్రి ఈ సంఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్తూరు పీఎస్‌ పరిధిలో నివసిస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహిళ రాత్రి అపరిచిత యువకునితో ఉందని ఆరోపిస్తూ స్థానికులు కేకలు వేస్తూ ఆమెను ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చి కొట్టారు. మహిళ గాయపడగా కొందరు ఆస్పత్రికి తరలించారు. వర్తూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

గవర్నర్‌ దిగిపోవాలి

కన్నడ సంఘాల ధర్నా

దొడ్డబళ్లాపురం: హిందీ భాషకు మద్దతుగా, కన్నడ భాషకు వ్యతిరేకంగా గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ వ్యవహరిస్తున్నారని కన్నడ సంఘాల నాయకులు ఆరోపించారు. సోమవారంనాడు కర్ణాటక రక్షణ వేదిక ఆధ్వర్యంలో బెంగళూరు ఫ్రీడం పార్క్‌లో ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో హిందీ భాషను బలవంతంగా అమలు చేయాలనేది గవర్నర్‌ ఉద్దేశమన్నారు. గవర్నర్‌ అధికార పరిధిని మీరుతున్నారని దుయ్యబట్టారు. గవర్నర్‌కు రాష్ట్రంలో అధికారంలో ఉండే అర్హత లేదన్నారు. తక్షణం రాజీనామా చేసి రాష్ట్రాన్ని వదిలి వెళ్లాలని డిమాండు చేశారు.

కాశీ విశ్వేశ్వర రథోత్సవం

బొమ్మనహళ్లి: ఆనేకల్‌ తాలూకాలోని నెరలూరులో చరిత్ర ప్రసిద్ధ శ్రీకాశీ విశ్వనాథేశ్వరస్వామి బ్రహ్మ రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి మూల విరాట్టుకు విశేష పూజలు సాగించారు. ఆపై ఉత్సవ విగ్రహానికి పూజలు, యాగాలు నిర్వహించి తేరులో ప్రతిష్టించారు. కళాకారుల డప్పు వాయిద్యాల మధ్య తేరును లాగారు. భక్తులు రథంపై అరటి పండ్లను విసిరి జై కాశీ విశ్వేశ్వరా అని గట్టిగా స్మరించారు.

19 నుంచి మైసూరులో సైనిక నియామకాలు

మైసూరు: మైసూరు నజరాబాద్‌లోని చాముండి విహార్‌ స్టేడియంలో ఏప్రిల్‌ 19 నుంచి 27 వరకు సైనికుల నియామకాల కోసం అగ్నివీర్‌ ర్యాలీ జరగనుంది. 6 వేల మందికిపైగా అభ్యర్థులు పాల్గొంటారని బెంగళూరుకు చెందిన సైనిక అధికారి కల్నల్‌ వివేక్‌ జాందార్‌ తెలిపారు. సోమవారం ఆయన స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ ర్యాలీలో 6043 మంది యువకులు, 192 మంది యువతులు పాల్గొంటారన్నారు. ప్రతిరోజూ 800 మంది అభ్యర్థులకు శారీరక, ఇతర పరీక్షలు నిర్వహిస్తారు. శారీరక పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 27న మహిళా అభ్యర్థుల ర్యాలీ జరుగుతుందని ఆయన తెలిపారు.

భారీ దంతాల గజరాజు

యశవంతపుర: చిక్కమగళూరు జిల్లాలో అతి పెద్ద దంతాలు కలిగిన ఓ గజరాజు ప్రత్యక్షమైంది. దాని దంతాల రాజసం చూసి పర్యాటకులతో పాటు స్థానిక జనం కూడా సంభ్రమానికి గురయ్యారు. ముత్తోడి అభయ అరణ్యంలో వందల సంఖ్యలో ఏనుగులున్నాయి. ఒక్కో ఏనుగు భారీ సైజులో ఉంటుంది. పెద్ద దంతాలున్న ఓ ఏనుగు కొన్నిరోజులుగా బ్రిటిష్‌కాలంనాటి అరణ్య విశ్రాంతి గృహం వద్ద కనపడుతోంది. పనస చెట్టు కాయలను తినడానికి ఇది వస్తోందని గుర్తించారు. ఈ ఏనుగుకు 40 ఏళ్లు ఉండవచ్చని స్థానిక పర్యావరణవాది వీరేశ్‌ తెలిపారు. దాని దంతాల పొడవు మామూలు ఏనుగుల కంటే చాలా ఎక్కువని చెప్పారు. గతంలో బండీపుర అడవుల్లో భోగేశ్వర అనే కరిరాజు అతి పొడవైన దంతాలతో ఆసియాలోనే రికార్డులకెక్కింది. కొన్నేళ్ల కిందట అది కన్నుమూసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement