దర్శన్‌ రోల్‌.. బాస్‌పై స్టే | - | Sakshi
Sakshi News home page

దర్శన్‌ రోల్‌.. బాస్‌పై స్టే

Apr 7 2026 8:07 AM | Updated on Apr 7 2026 8:07 AM

బనశంకరి: రేణుకాస్వామి హత్య ఘటన ఆధారంగా బాస్‌ అనే కన్నడ సినిమా రూపొందించినట్లు తెలిసింది. ఈ చిత్రం విడుదల చేయరాదంటూ ఆ కేసులో నిందితుడు, నటుడు దర్శన్‌ భార్య విజయలక్ష్మి కోర్టును ఆశ్రయించారు. దర్శన్‌ను అభిమానులు ‘ది బాస్‌’ అని పిలుచుకోవడం తెలిసిందే. వివరాలు.. బాస్‌ సినిమా టీజర్‌ ఇటీవల సోషల్‌ మీడియాలో విడుదల అయ్యింది. రేణుకాస్వామి హత్య ఆధారంగా ఈ సినిమా తీశారని అందులో స్పష్టమైంది. అతని కిడ్నాప్‌, హత్య దృశ్యాలు కనిపిస్తాయి. దీంతో దర్శన్‌ భార్య విజయలక్ష్మి సినిమాను విడుదల చేయరాదని బెంగళూరు సిటీ సివిల్‌ కోర్టులో పిటిషన్‌ వేయగా, విచారించిన జడ్జి.. చిత్రంపై స్టే ఇచ్చారు. ఈ నెల 14న విడుదల చేయాలని నిర్మాతలు ప్రయత్నాల్లో ఉండగా స్టే జారీ అయ్యింది.

మహిళా ఎస్‌ఐపై దాడికి యత్నం

చింతామణి: తనపై కొందరు దాడికి యత్నించారని రూరల్‌ ఎస్‌ఐ నాగమ్మ పోలీసులకు పిర్యాదు చేశారు. వివరాలు. ఆదివారం రాత్రి 11 గంటలకు పట్టణ శివార్లలోని చిన్నసంద్ర గ్రామంలో జమ్‌జమ్‌ హోటల్‌ తెరిచి ఉండగా, సమయం అయిందని, మూసివేయాలని యజమాని షాహిద్‌ఖాన్‌కు తన జీప్‌ డ్రెవర్‌ వేణుగోపాల్‌ చెప్పారు. అక్కడ ఉన్న కొందరిలో 6 మంది డ్రైవరుపై దౌర్జన్యానికి వచ్చారు, తాను అడ్డుకోగా సెల్‌ఫోన్‌ను లాక్కుని, పక్కకు తోసేశారని తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.

బెంగళూరు– ముంబై ఎక్స్‌ప్రెస్‌ వే?

దొడ్డబళ్లాపురం: బెంగళూరు నుంచి ముంబైకి రోడ్డు మార్గాన వెళ్తే కనీసం 12 గంటలు పడుతుంది, ఈ సమయాన్ని తగ్గించేలా పూణె– బెంగళూరు మధ్య 745 కిలోమీటర్ల మేర రూ.40 వేల కోట్లతో గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే ని నిర్మించే ప్రస్తావన కేంద్ర ప్రభుత్వం ముందుంది. ఇది పూర్తయితే బెంగళూరు–ముంబై మధ్య రోడ్డు ప్రయాణం 5.5 గంటలే పడుతుంది. ప్రయాణం నిరాటంకంగా సాగేలా 8 లేన్ల రహదారి, బైపాస్‌లను నిర్మిస్తారు. 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ మీడియాతో సూచనప్రాయంగా ఈ విషయాన్ని చెప్పారు. ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మిస్తున్న మార్గాల్లో విమాన సర్వీసులు రద్దవుతున్నాయని ఆయన చమత్కరించారు. ఇప్పుడు పనులు ప్రారంభిస్తే రెండేళ్లలో పూర్తవుతాయని అంచనాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement