యడియూరు బయోగ్యాస్ ప్లాంటులో డ్రమ్ముల్లో తడిచెత్త
యడియూరు ప్లాంటులో గ్యాస్ ట్యాంకు
బనశంకరి: బెంగళూరులో నిత్యం ఇళ్లు, హోటళ్ల నుంచి వెయ్యి టన్నులకుపైగా తడి చెత్త సేకరణ అవుతుంది. మిగిలిపోయిన ఆహారం, కూరగాయలు, పండ్లు వంటివి ఇందులో ఉంటాయి. ఈ చెత్తతో మీథేన్ గ్యాస్‌ను ఉత్పత్తి చేయవచ్చు. బెంగళూరులోని యడియూరు వార్డులో నగర పాలికె ఆధ్వర్యంలో ఇటువంటి గ్యాస్ ఉత్పాదన క్షేత్రం పనిచేస్తోంది. రోజూ 5 టన్నుల తడి చెత్తతో 3,000 కిలోవాట్ల విద్యుచ్చక్తి, 4,500 లీటర్ల మీథేన్ గ్యాస్ ఉత్పత్తి అవుతున్నట్లు అధికారులు తెలిపారు.
198 వార్డుల్లో ఏర్పాటుకు ప్లాన్
ఇదే తరహాలో గత బీబీంపీ పరిధిలో 198 వార్డుల్లో 2,400 చదరపు అడుగుల విస్తీర్ణం చొప్పున స్థలాలను గుర్తించి అందులో బయోగ్యాస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఆయా వార్డుల్లో ఉత్పత్తిఅయ్యే తడిచెత్తను మీథేన్ గ్యాస్‌గా మార్చాలని ప్రతిపాదనలు ఉండేవి. తద్వారా వేలాది లీటర్ల ఇంధన గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఆ గ్యాస్‌ను ఇళ్లకు సరఫరా చేయవచ్చు. తద్వారా ఎల్‌పీజీ మీద ఆధారపడడం తగ్గుతుంది, అలాగే గ్యాస్ ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించినట్లు అవుతుందని పర్యావరణ నిపుణులు తెలిపారు. ఈ పథకాన్ని పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తే ప్రతి నెలా 14 లక్షల కుటుంబాలకు 50 శాతం సిలిండర్ల పంపిణీ చేయవచ్చు. దేశంలోనే పెద్ద మార్పు సృష్టించినట్లు అవుతుందని చెప్పారు.
అన్ని నగరాల్లో..
ఇదే మాదిరిగా రాష్ట్రంలో 12 మహానగరాల్లో ప్రతి నిత్యం సేకరించే తడి చెత్తతో బయో గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల గ్యాస్ కొరత అనేది ఉండదని పేర్కొన్నారు. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ. 75 లక్షల నుంచి కోటి రూపాయలు వ్యయం అవుతుందన్నారు. 5 నుంచి 10 టన్నుల సామర్థ్యంతో నిర్మించవచ్చని తెలిపారు. రూ.200 కోట్లతో మొత్తం బెంగళూరులో 198 వార్డుల్లో ఒక్కో గ్యాస్ ప్లాంటును ఏర్పాటు చేయవచ్చని తెలిపారు.
గ్యాస్ ప్లాంట్ల ద్వారా ఇంధన ఉత్పత్తి
బెంగళూరులో సాకారమైతే
మంచిరోజులే
గతంలో వార్డుకు ఒక ప్లాంటు ఏర్పాటుకు యోచన


