సాక్షి,బళ్లారి: తీవ్ర అనారోగ్య సమస్యతో భార్య ఆత్మహత్య చేసుకుని మృతి చెందగా, భార్యను చూసేందుకు వస్తూ రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందడంతో మరణంలోనూ భార్యాభర్తల బంధం వీడనిదిగా మారింది. వివరాలు... బెళగావి జిల్లా బైలహొంగల తాలూకా అరవళ్లికి చెందిన మధుర(30), కరెప్ప(36) భార్యాభర్తలు. మధుర కొన్ని నెలలుగా ఆనారోగ్యం బారిన పడి తీవ్ర ఇబ్బందులకు గురవుతోంది. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం కూడా. అనారోగ్యం బారిన పడటంతో కుటుంబానికి భారంగా మారుతానని విషం తాగి మధుర ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే స్థానికులు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించింది. భార్యను చూసేందుకు భర్త కరెప్ప బెళగావికి వస్తున్న సమయంలో రోడ్డు దాటుతుండగా ధార్వాడ నుంచి బైలహొంగల వెళుతున్న వాయువ్య కర్ణాటక ఆర్‌టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
తల్లిదండ్రుల మృతితో పిల్లలు అనాథలు
ఈ ఘటన సమాచారం తెలిసిన వెంటనే బైలహొంగల పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇద్దరూ పెళ్లి చేసుకుని తొమ్మిదేళ్లు కాగా, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఒకే రోజు తల్లిదండ్రులు మృతి చెందడంతో చిన్న పిల్లలు అనాథలయ్యారు. ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాల్సింది పోయి తల్లి ఆత్మహత్య చేసుకోవడం ఏంటని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భార్యను చూడటానికి వస్తూ భర్త కూడా మృతి చెందడంతో ఒకే రోజు తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల రోదనలను ఆపేందుకు ఎవరి తరం కాలేదు. ఈ విషాదకర ఘటన పలువురిని కంటతడి పెట్టించింది. ఒకే రోజు భార్యాభర్తలు మృతి చెందడం, ముగ్గురు చిన్నారులు అనాథలు కావడం ప్రతి ఒక్కరినీ కలిచివేసింది.
అనారోగ్య సమస్యతో భార్య బలవన్మరణం
భార్య వద్దకు వస్తూ బస్సు ఢీకొని భర్త మృతి


